
నేనూ శ్రీవారి సేవకుడినే
టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను మొదట్నుంచీ శ్రీవారి సేవకుడినే. 1994లో తొలిసారి స్వామిని దర్శించుకున్నా. అప్పట్నుంచి ఎక్కడున్నా కూడా ఏటా శ్రీవారి దర్శనానికి వస్తూనే ఉన్నాను. కానీ ఇలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా స్వామికి సేవ చేసే భాగ్యం లభిస్తుందని మాత్రం ఊహించ లేదు..’ అని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి టీటీడీ బోర్డు నిర్ణయాలను గౌరవిస్తూ భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించడమే తన లక్ష్యమని చెప్పారు.
టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు కాలినడకన తిరుమల చేరుకుని సాధారణ క్యూలోనే దర్శనం చేసుకున్నానని, దీనివల్ల భక్తుల ఇబ్బందులు, అభిప్రాయాలు స్వయంగా తెలుసుకునే వీలు కలిగిందన్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం జరిగేలా కౌంటర్ల పనివేళల్లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. కాగా, తనకన్నా ముందు పనిచేసిన ఈవోలందరూ టీటీడీ వృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.
అవి రెండూ వేరు కాదు..
తిరుపతి, తిరుమల వేర్వేరు కాదని.. రెండు చోట్లా అభివృద్ధి జరగాలని ఈవో సింఘాల్ అభిప్రాయపడ్డారు. నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాలను పూర్తి చేస్తామని చెప్పారు. దేశవిదేశాలు, సుదూర ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకునే యాత్రికులకు బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక మరుగుదొడ్లు, రవాణా సదుపాయాలు కల్పించే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షణ పెంచుతామన్నారు.