నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం | Silk garment offering from Srirangam to Tirumala srivaru | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం

Published Mon, Jul 17 2017 3:38 AM | Last Updated on Sat, Aug 25 2018 7:11 PM

నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం - Sakshi

నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా సాగింది.

శ్రీవారికి శ్రీరంగం నుంచి పట్టువస్త్రాల సమర్పణ
 
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా సాగింది. పూర్వం మహంతుల పాలనలో దేవస్థానం ఆదాయ, వ్యయాల లెక్కలన్నీ ఆణివార ఆస్థానం రోజునే ప్రారంభమయ్యేవి. దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పడ్డాక ఆర్థిక సంవత్సరంలోకి మారాయి. అయినప్పటికీ అనాదిగా నిర్వహించే ఆణివార ఆస్థానం ఉత్సవ సంప్రదాయాన్ని టీటీడీ నేటికీ ఆగమబద్ధంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బంగారువాకిలిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి, సేనాపతి విష్వక్సేనుల వారిని వేంచేపు చేసి కొలువు నిర్వహించారు.

తమిళనాడు శ్రీరంగ క్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఆరు నూతన పట్టువస్త్రాలను ఊరే గింపుగా తీసుకొచ్చి గర్భాలయంలోని మూలమూర్తికి 4 పట్టు వస్త్రాలు, మరొకటి మలయప్పకు, ఇంకొ కటి విష్వక్సేనుల వారికి సమర్పించారు. వాటిని అలంకరించిన తర్వాత గర్భాలయంలో సంప్ర దాయ, వైదిక పూజలు నిర్వహించారు. పెద్ద జీయర్, చిన్న జీయర్, టీటీడీ ఈవోలకు సంప్రదాయంగా జీయంగారి సీలు (మెహరు), తాళం చెవుల గుత్తి (లచ్చన) అందజేసి, తీర్థం, శఠారి మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి గమేకార్, హథీరాం మహంతు, మైసూరు, తాళ్లపాకం, తరిగొండవారి హారతులు సమర్పించారు. కార్యక్రమానికి హాజరైన వారి వద్ద నుంచి రూపాయి చొప్పున వసూలు చేసి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు సమక్షంలో శ్రీవారి ఖజానా (హుండీ)లో జమ చేయటంతో స్వామివారికి ఆస్థాన కార్యక్రమం ముగిసింది.
 
కోలాహలంగా పల్లకి ఊరేగింపు
ఆణివార ఆస్థానం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం పల్లకి ఊరేగింపు నిర్వహించారు. మొత్తం రెండు టన్నుల బరువు కలిగిన పల్లకిలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement