
టీటీడీలో ‘సండ్ర’ కలకలం
తిరుమల: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్యను సోమవారం తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ ఘటన టీటీడీలో ప్రధాన చర్చనీయాంశమైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను నగదుతో ప్రలోభపెట్టిన కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరైన ‘సండ్ర’ను అరెస్ట్‌చేసినట్టు ఏసీబీ అధికారులు విచారణ అనంతరం ధ్రువీకరించారు. ఈ ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కలకలం రేపింది. ప్రస్తుత ట్రస్టు బోర్డులో ఈయన సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతనెల 13వ తేదీన తిరుమల ఆలయ సన్నిధిలో ప్రమాణస్వీకారం చేశారు. పదవి చేపట్టిన నెలన్నర రోజుల్లోనే అనుకోని పరిణామాలతో ఆయన అరెస్టయ్యారు.
ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ అరెస్ట్ అయిన తొలి వ్యక్తి ఈయనే. దీంతో తాజా బోర్డులో ఈయన కొనసాగింపు అంశం తెరపైకి వచ్చింది. ఆమేరకు తీవ్ర చర్చ జరుగుతోంది. ఐదేళ్లకు ముందు శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలతో అప్పటి బోర్డు సభ్యులు యాదయ్య, అంజయ్యతోపాటు మరో సభ్యుడిపై తిరుమలలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో విచారణ అటు ఇటూ తిరుగుతూ చివరికి అటెక్కింది. తాజా బోర్డులోని సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఏకంగా అరెస్ట్ కావడంతో బోర్డు సభ్యుడి పదవిలో కొనసాగుతారా? లేక రాజీనామా చేస్తారా? అనే అంశంపై చర్చ సాగుతోంది. టీటీడీ పరిపాలన విషయంలో ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో నైతికంగా టీటీడీ పదవిలో ‘సండ్ర’ ను కొనసాగిస్తారా? అనేది ప్రశ్నార్థకమైంది. ఆరోపణలతో అరెస్ట్ చేసినంత మాత్రమే రాజీనామా చేయాలనే నిబంధన లేదని కూడా టీటీడీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.