sandra venkatavirayya
-
‘రైతు బంధు’ సంబరాలు
సత్తుపల్లి: రైతుబంధు పథకానికి రూ.50వేల కోట్లు రైతులకు నేరుగా అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. సత్తుపల్లి మండలం గంగారంలో మంగళవారం రైతుబంధు సంబురాలను రంగవల్లులతో స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతువేదిక జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గానికి రైతుబంధు పథకం కింద 80వేల మంది రైతులకు రూ.5.67 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వాన్ని దీవించాలన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జేడీఏ విజయనిర్మల, ఏడీఏ నర్సింహారావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, సర్పంచ్ మందపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ దాసరి వెంకట్రామిరెడ్డి, రైతు సంఘం కన్వీనర్ గాదె సత్యం, యాగంటి శ్రీనివాసరావు, ఎస్కె రఫీ, మాదిరాజు వాసు పాల్గొన్నారు. వేంసూరు: మండల పరిధిలోని దూళ్లకోత్తురులో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. 70 ఏళ్లలో ఎన్నడు చూడని పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, మండల రైతుబంధు అధ్యక్షులు వెల్ధి జగన్మోహన్రావు, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. వైరారూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తూ.. ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మండలంలోని కొండకొడిమలో మంగళవారం నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ సభ్యురాలు నంబూరి కనకదుర్గ, సర్పంచ్ దొంతెబోయిన శ్రీను, ఎంపీటీసీ రాయల రమేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, ఏడీఏ బాబురావు, ఏఓ ఎస్.పవన్‌కుమార్, ఏఈఓ వెంకటనర్సయ్య తదితరులున్నారు. మధిర: మధిర వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం రైతుబంధు సంబరాలను ఘనంగా నిర్వహించారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పాలాభిషేకం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చావా వేణు తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్‌కు హాజరవుదామా.. వద్దా..?
కాంగ్రెస్ శాసనసభా పక్షం తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ ప్రతిపాదించే సమయంలో శాసనసభకు హాజరుకావడంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం తర్జనభర్జన పడుతోంది. టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను సస్పెండ్ చేసినందుకు శాసనసభను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేతగా కె.జానారెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయడానికి అధికార పక్షం అంగీకరించలేదు. ఇది కాంగ్రెస్‌కు మరింత ఆగ్రహా న్ని కలిగిస్తోంది. దీంతో శాసనసభలో భోజనాలను కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరస్కరించారు. అయితే సోమ వారం బడ్జెట్ ప్రవేశపెట్టననున్న నేపథ్యంలో సభలో అను సరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనూ సభలో ప్రధాన ప్రతిపక్షం హాజరుకాకుంటే, సభకు ప్రాధాన్యం, గౌరవం ఉండదని కొందరు ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. బడ్జెట్ ప్రతిపాదన సమయంలో సభకు హాజరుకాకుంటే బాధ్యతారాహిత్యమనే విమర్శలు వచ్చే అవకాశముందని, బడ్జెట్లోని అంశాలను ప్రశ్నించే సమయంలోనూ ఇబ్బంది రావచ్చని సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సభకు హాజరై, టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిలదీయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ సభ్యులు సూచించారు. అయితే ప్రతిపక్షం లేకుండా బడ్జెట్‌ను పెట్టాలనుకుంటే అది ప్రభుత్వానికి కూడా తలవంపులేనని యువ ఎమ్మెల్యేలు వాదించారు. ప్రధాన ప్రతిపక్షంతోపాటు ఇతర పార్టీల సభ్యులు కూడా లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెడితే ప్రభుత్వం అవమానంగా భావిస్తుందని, కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ముందుగా తెగేసి చెబితే ప్రభుత్వమే దిగొచ్చి, టీడీపీ ఎమ్మెల్యేలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశముందని కొందరు వాదిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనకు ముందే శాసన సభలో ఈ సస్పెన్షన్‌ను ప్రస్తావించి, మరోసారి సభలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సమంజసమని సీనియర్లు వాదించారు. చివరగా సభకు హాజరై, సస్పెన్షన్‌ను ఎత్తివేసేలా చొరవ తీసుకోవాలనే యోచనకు వచ్చినట్టుగా తెలిసింది. -
శాసనసభలో ఏకపాత్రాభినయం
సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాలదే కాకుండా మంత్రుల గొంతునొక్కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులే శాసనసభలో ఏకపాత్రాభినయం చేశారని టీటీడీఎల్పీనేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన మాట్లాడారు. సమావేశాల్లో కేబినెట్ మంత్రులను తోలుబొమ్మలుగా మార్చారని ఆరోపించారు. శాసనసభ శీతాకాల సమావేశాలు 94 గంటలు జరిగితే 54 గంటలు ప్రభుత్వమే మాట్లాడిందన్నారు. 30 గంటలపాటు కేవలం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే మాట్లాడారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను, మంత్రులనే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా కేసీఆర్ అవమానించారని వ్యాఖ్యానించారు. భూసేకరణపై రెవెన్యూ మంత్రి మహమూద్ అలీకి బదులు నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, మైనార్టీలపై సీఎం కేసీఆర్ మాట్లాడి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని అవమానపర్చారని విమర్శించారు. -
టీటీడీలో ‘సండ్ర’ కలకలం
తిరుమల: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు సండ్ర వెంకటవీరయ్యను సోమవారం తెలంగాణ ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ ఘటన టీటీడీలో ప్రధాన చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను నగదుతో ప్రలోభపెట్టిన కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరైన ‘సండ్ర’ను అరెస్ట్‌చేసినట్టు ఏసీబీ అధికారులు విచారణ అనంతరం ధ్రువీకరించారు. ఈ ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కలకలం రేపింది. ప్రస్తుత ట్రస్టు బోర్డులో ఈయన సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతనెల 13వ తేదీన తిరుమల ఆలయ సన్నిధిలో ప్రమాణస్వీకారం చేశారు. పదవి చేపట్టిన నెలన్నర రోజుల్లోనే అనుకోని పరిణామాలతో ఆయన అరెస్టయ్యారు. ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ అరెస్ట్ అయిన తొలి వ్యక్తి ఈయనే. దీంతో తాజా బోర్డులో ఈయన కొనసాగింపు అంశం తెరపైకి వచ్చింది. ఆమేరకు తీవ్ర చర్చ జరుగుతోంది. ఐదేళ్లకు ముందు శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలతో అప్పటి బోర్డు సభ్యులు యాదయ్య, అంజయ్యతోపాటు మరో సభ్యుడిపై తిరుమలలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో విచారణ అటు ఇటూ తిరుగుతూ చివరికి అటెక్కింది. తాజా బోర్డులోని సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య ఏకంగా అరెస్ట్ కావడంతో బోర్డు సభ్యుడి పదవిలో కొనసాగుతారా? లేక రాజీనామా చేస్తారా? అనే అంశంపై చర్చ సాగుతోంది. టీటీడీ పరిపాలన విషయంలో ఎలాంటి ఆరోపణలకు అవకాశం లేకుండా చేస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో నైతికంగా టీటీడీ పదవిలో ‘సండ్ర’ ను కొనసాగిస్తారా? అనేది ప్రశ్నార్థకమైంది. ఆరోపణలతో అరెస్ట్ చేసినంత మాత్రమే రాజీనామా చేయాలనే నిబంధన లేదని కూడా టీటీడీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.