ఒంగోలు సెంట్రల్: జిల్లా వ్యాప్తంగా 4,292 టీబీ కేసులను గత సంవత్సరం ఆఖరు వరకూ గుర్తించినట్లు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ డి.సురేష్‌కుమార్ తెలిపారు. స్థానిక జిల్లా క్షయ నివారణ కార్యాలయంలోని టీటీసీఓ చాంబర్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 24,042 మంది క్షయ అనుమాతులను పరీక్షించినట్లు తెలిపారు. వీరిలో 4,292 కేసులు పాజిటివ్‌గా వచ్చాయన్నారు. 41,233 కేసులను చికిత్స ద్వారా నయం చేసినట్లు తెలిపారు. ఎండీఆర్‌టీబీ అనుమానితులను పరీక్షించగా 90 మందికి ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో 77 మందికి చికిత్స ద్వారా టీబీని నయం చేసినట్లు తెలిపారు. టీబీ–హెచ్‌ఐవీతో బాధపడుతున్న 533 మందికి మందులు అందిస్తున్నట్లు తెలిపారు. టీబీ మరణాలను నివారించేందుకు ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత నెలలో టీబీ వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించి, ప్రతి గ్రామం, మండలంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. లక్ష మంది ప్రజలలో 217 మందికి క్షయ వ్యాధి వస్తుంటే ఈ సంఖ్యను గణనీయంగా 171కి తగ్గించగలిగామన్నారు. క్షయ వ్యాధి మరణాలు లక్షకు 38 ఉంటే వాటిని 19కి తగ్గించామని చెప్పారు. 2025వ సంవత్సరానికి లక్ష మందిలో కేవలం 10 మంది క్షయ వ్యాధిగ్రస్తులు మాత్రమే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు
ఆన్‌లైన్‌లో రోగి వివరాలు...
ఎలక్ట్రానిక్ ల్యాబ్ విధానం ద్వారా ప్రతి రోగి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు జిల్లా క్షయనివారణ అధికారి డాక్టర్ సురేష్ తెలిపారు. నిక్షయ్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా రోగులను నమోదు చేస్తామని, నేమ్ బేస్‌డ్.. కేస్ బేస్‌డ్‌గా నమోదు చేయడంతో ఫాలో అప్ చికిత్సలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. జిల్లాకు మరో సిబినాట్ యంత్రం మార్కాపురంలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యంత్రం ద్వారా రెండు గంటల్లోనే ఎండీఆర్ టీబీని గుర్తించవచ్చన్నారు. యూనివర్సల్ డీఎస్టీలో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి రోగికి 2 కళ్లె నమూనాలు సేకరించి ఎండీఆర్ టీబీ, రెండో నమూనాను ఎల్‌పీఏ పరీక్ష నిమిత్తం విశాఖపట్నానికి పంపిస్తామన్నారు. దీని వలన ఏ మందులు రోగికి పనిచేస్తాయో తెలుసుకుని ఆ మందులను వాడటం జరుగుతుందన్నారు. టీబీ రోగులకు పోషకాహారం తీసుకునేందుకు చికిత్స కాలంలో ప్రతి నెలా 500 పెన్షన్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలో ఈ నెల 24న ఉదయం 9 గంటలకు అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం సంతపేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో సభ నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment