రూ. 100 కోట్లు చేతులు మారిన సొమ్ము
జిల్లా అంతటా జోరుగా కోడిపందేలు, పేకాట
గోదావరి జిల్లాలను తలపించేలా భారీగా శిబిరాలు
పోటెత్తిన పందెం రాయుళ్లు
మచిలీపట్నం : సంక్రాంతి పండుగ మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు భారీస్థాయిలో నిర్వహించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను తలపిస్తూ ఈసారి జిల్లాలోనూ పందెం రాయుళ్లు పోటెత్తారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కోడిపందేల బరులు యథేచ్ఛగా కొనసాగాయి. పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో యథేచ్ఛగా శిబిరాలు నిర్వహించారు. బరుల వద్దే బెల్టుషాపులనూ ఏర్పాటు చేశారు. పందెం రాయుళ్ల కోసం రెస్టారెంట్లను ఏర్పాటు చేసి బరుల వద్ద సకల సౌకర్యాలు కల్పించారు. కోడిపందేల పేరుతో ఏర్పాటు చేసిన బరుల్లో పెద్ద ఎత్తున పేకాట, జూదాలూ నిర్వహించారు.
నేడూ కొనసాగనున్న పందేలు...
భోగి రోజున ప్రారంభమైన ఈ బరులు ఆదివారం కొనసాగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో పండుగ మూడు రోజుల పాటు కోడిపందేలు, పేకాట తదితరాల రూపంలో రూ.100 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో కోడిపందేలు, పేకాటను భారీస్థాయిలో నిర్వహించారు. సినీ నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, ప్రసాద్ కోడిపందేలను తిలకించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, వత్సవాయిలో కోడిపందేలు కొనసాగాయి. పామర్రు నియోజకవర్గంలోని యలకుర్రు, కొమరవోలు, కనుమూరు, గూడపాడులో కోడిపందేలు, పేకాటజోరుగా సాగాయి. తిరువూరులోని కాకర్ల, ముష్టికుంట్ల, ఎ.కొండూరు మండలంలో రేపూడి, గంపలగూడెం మండలం తోటమూల ప్రాంతాల్లో కోడిపందేలు, పేకాట, గుండాటలు నిర్వహించారు. మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయం వద్ద కోడిపందేలను మంత్రి కొల్లు రవీంద్ర వీక్షించారు. గాలిపటాలను ఎగురవేశారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట జరిగాయి. కొల్లేటికోట, భుజబలపట్నం, భైరవపట్నం, కలిదిండి మండలం నాగన్నచెరువు తదితర ప్రాంతాల్లో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు.
మైలవరం మండలంలోని నాగులేరు, జి.కొండూరు మండలంలోని వెలగలేరు, ఇబ్రహీంపట్నంలో భారీస్థాయిలో బరులను ఏర్పాటు చేశారు. నూజివీడు నియోజకవర్గంలోని జనార్దనవరం, పోతిరెడ్డిపాలెం, జంగంగూడెం, ఈదర, శోభనాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గంలోని కొంకేపూడిలో కోడిపందేల కన్నా పేకాట శిబిరం జోరుగా కొనసాగింది. బంటుమిల్లి మండలం పెందుర్రులో భారీస్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. వెంకటాపురం, నడకుదురు, శ్రీకాకుళం, దిండి, సంగమేశ్వరం, సొర్లగొంది, జరుగువానిపాలెంలలో పేకాట, కోడిపందేల శిబిరాలను నిర్వహించారు.
కృష్ణవరంలో ఘర్షణ...
ఆగిరిపల్లి మండలం కృష్ణవరం కొమ్మూరు చెరువులో ఏర్పాటు చేసిన కోడిపందేల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. వీరబత్తిన జోషి అనే వ్యక్తి గాయాలపాలయ్యాడు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బరిలో ఉన్న వారిని చెదరగొట్టారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.