ట్యూటర్ల సమస్య ఉంది
కొమరోలు : పశ్చిమ ప్రకాశంలో జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడి వసతి గృహాల్లో హాజరుశాతం 20 నుంచి 50శాతం వరకు తగ్గిందని జిల్లా బీసీ సంక్షేమాధికారి కె. మయూరి తెలిపారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘గుండెల్లో పది గంటలకు’ స్పందించిన ఆమె నియోజకవర్గంలోని పలు వసతి గృహాలను తనిఖీ చేశారు. వసతి గృహాల్లో టూటర్ల సమస్య ఎక్కువుగానే ఉందని, దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడి ఉత్తీర్ణతాశాతంపై పడే ప్రమాదం ఉందన్నారు.
గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని పలు హాస్టల్స్‌ను తనిఖీలు చేశారు. అక్కడున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొమరోలు మండలంలోని కొమరోలు బీసీ బాలికల, బాలుర హాస్టల్స్, అల్లినగరం బీసీ హాస్టల్, గిద్దలూరు బీసీ బాలికలు, బాలుర హాస్టల్స్, కళాశాల బీసీ హాస్టల్, సంజీవరాయునిపేట బీసీ హాస్టల్, అనుమలవీడు బీసీ హాస్టల్‌లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువ మంది ఉంటున్నారని, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తుతోందన్నారు. హాస్టల్ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడంలేదన్నారు.
విద్యార్థులకు సరైన ఆహారం, వసతి, విద్యను అందించాల్సిన సంక్షేమ సిబ్బంది సరిగా లేనందున ఏబీసీడబ్ల్యూ, హెచ్‌డబ్ల్యూలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. కొమరోలు బీసీ బాలికల వసతి గృహంలో వార్డెన్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గిద్దలూరులోని బీసీ బాలికల వసతి గృహంలో భోజనం చేశామని, అక్కడ సంతృప్తికరంగా ఉందన్నారు. హాస్టల్స్‌లో ట్యూటర్ల సమస్య కొంత ఇబ్బందిగానే ఉందన్నారు.