క్లిక్‌ చేస్తే సారొస్తారు! | Special chit chat with Tutors pride founder Jaya | Sakshi
Sakshi News home page

క్లిక్‌ చేస్తే సారొస్తారు!

Published Sat, Dec 1 2018 12:24 AM | Last Updated on Sat, Dec 1 2018 7:59 AM

Special chit chat with Tutors pride founder Jaya - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌ వంటివే కాదు ప్లంబర్, పెయింటర్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసే రోజులివి. అయితే వీటిల్లో ఏ సేవలకైనా సరే ఇంటికొచ్చే వ్యక్తి గురించి మనం  ఎంక్వయిరీ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆర్డర్లను డెలివరీ చేయటం వరకే వారి పని. మరి, హోమ్‌ ట్యూషన్స్‌ చెప్పే ట్యూటర్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటే? తల్లిదండ్రులు చాలానే ఆలోచించాలి. ఎందుకంటే ట్యూటర్‌ మేధస్సే కాదు అతని వ్యక్తిత్వం, ప్రవర్తన కూడా ముఖ్యం. ఒక తల్లిగా తనకెదురైన ఇలాంటి సమస్య... ఇంకెవరికీ రాకూడదని నిర్ణయించుకుంది జయ. అంతే! ట్యూటర్స్‌ప్రైడ్‌.కామ్‌ను ప్రారంభించింది. అకడమిక్‌ ట్యూటర్స్‌ మాత్రమే కాక నాన్‌–అకడమిక్‌లోనూ ట్యూటర్స్‌ అందుబాటులో ఉండటమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కె.ఎం.ఈ.జయ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 

‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. పెళ్లయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ఎంఫిల్‌ చదివా. సిటీలోని ఒకటిరెండు స్కూల్స్, కాలేజీల్లో టీచర్‌గా పనిచేశా. యూఎస్, యూకేలోని పలువురు స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేదాన్ని. మా రెండో అబ్బాయి జాతీయ స్థాయిలో టెన్నిస్‌ ప్లేయర్‌. దీంతో రోజూ స్కూల్‌కెళ్లడం ఇబ్బందయ్యేది. పరీక్షల సమయంలో నేను, మా ఆయన ఒకటిరెండు సబ్జెక్ట్‌లు తప్ప చెప్పలేకపోయాం.  ప్రైవేట్‌ ట్యూషన్‌ పెట్టిద్దామని ప్రయత్నించాం. లాభం లేకుండా పోయింది. ఆ సమస్యకు పరిష్కారం వెతికే పనిలోనే ట్యూటర్స్‌ ప్రైడ్‌కు బీజం పడింది. రూ.10 లక్షల పెట్టుబడితో గతేడాది సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ‘ట్యూటర్స్‌ ప్రైడ్‌.కామ్‌’ను ప్రారంభించాం. 

స్కూల్స్, కాలేజీలకు  కూడా సేవలు.. 
ప్రస్తుతం ట్యూటర్స్‌ ప్రైడ్‌లో హోమ్‌ ట్యూషన్‌ సేవలు, ఆన్‌లైన్‌ కోర్సుల విక్రయం, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే 6 నెలల్లో వాట్సాప్‌ వీడియో కాల్స్, వీడియో లైవ్‌ స్ట్రీమింగ్‌ సేవలను అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం 66 వేల రకాల కోర్సులున్నాయి. స్కూల్, కాలేజీ సబ్జెక్ట్‌ ట్యూటర్స్‌ మాత్రమే కాక స్పోకెన్‌ ఇంగ్లిష్, పోటీ పరీక్షలు, కంప్యూటర్‌ కోర్సుల ట్యూటర్స్‌తో పాటూ సంగీతం, నృత్యం, డ్రాయింగ్, పెయింటింగ్, గుర్రపు స్వారీ, పర్సనల్‌ జిమ్‌ ట్రెయినర్స్, మెజీషియన్స్, ఫొటోగ్రఫీ, జ్యోతిష్యం, ఫిజియోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాసం, కుకింగ్, స్పోర్ట్స్, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి నాన్‌ అకడమిక్‌లోనూ శిక్షకులుంటారు. తల్లిదండ్రులే కాకుండా స్కూల్స్, కాలేజీలు కూడా మా ట్యూటర్స్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి.  

తనిఖీ చేశాకే ట్యూటర్స్‌ నమోదు.. 
ట్యూటర్స్‌ నమోదు ఉచితమే. కానీ, పలు రకాల తనిఖీలు, పరీక్షలు నిర్వహించాకే వారిని నమోదు చేస్తాం. ముందుగా ఇంటర్వ్యూ.. తర్వాత వీడియో డెమో క్లాస్‌లు, సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. తర్వాత సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ ట్యూటర్‌ (సీఓటీ) పరీక్ష ఉంటుంది. గంటలు, రోజుల లెక్కల చొప్పున లేదా సబ్జెక్ట్‌ల వారీగా కాకుండా పాఠాల వారీగా, చాప్టర్ల వారీగా కూడా ట్యూటర్స్‌ను నియమించుకునే వీలుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 లక్షల మంది ట్యూటర్స్‌ నమోదయ్యారు. ఇందులో అకడమిక్‌లో 70 శాతం, నాన్‌–అకడమిక్‌లో 30 శాతం ఉంటారు. 

రూ.20 కోట్ల ఆదాయం లక్ష్యం.. 
యూజర్లు మా సేవలను వినియోగించుకోవాలంటే ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ రుసుము రూ.2,999. ప్రస్తుతం 46 వేల యూజర్లున్నారు. వీరిలో 1,500 మంది సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లు. ఏడాదిలో 2 లక్షల యూజర్లకు చేరాలనేది లక్ష్యం. నెలకు 600 మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. గత ఏడాది రూ.40 లక్షల వ్యాపారాన్ని చేరుకున్నాం. 2020 నాటికి రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం.

రూ.100 కోట్ల నిధుల సమీకరణ 
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ప్రతి వారం పేరెంట్స్‌ కౌన్సెలింగ్‌ సమావేశాలు, పలు విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు రూ.3 కోట్ల పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతం మా సంస్థలో 27 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో వంద మందిని నియమించుకుంటాం. ఇందులో 60 శాతం మంది మహిళ ఉద్యోగులే ఉంటారు. వచ్చే ఏడాది కాలంలో రూ.100 కోట్ల నిధులను సమీకరించాలన్నది లక్ష్యం’’ అని జయ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement