వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. ద్విచక్రవాహనాల్లో వెళుతున్న వారిని లారీ, టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం మిగిల్చింది. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కలచివేశాయి.
హిందూపురం అర్బన్: రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు దుర్మరణం చెందాడు. వివరాల్లోకెళ్తే.. హిందూపురం పట్టణంలోని వీవర్స్ కాలనీలో నివాసముంటున్న చేనేత కార్మికుడు రాము (30), శాంత దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నేతపనికి అవసరమైన ముడి సరుకు కోసం బుధవారం రాము ద్విచక్రవాహనంలో ముద్దిరెడ్డిపల్లికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని బైపాస్ మీదుగా ఇంటికి బయల్దేరాడు. ఆటో నగర్ సమీపంలో తన ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఉన్నపళంగా బ్రేక్ వేశాడు. ఆ వెనకే వస్తున్న రాము వేగం అదుపుకాకపోవడంతో టిప్పర్ కిందకు దూసుకుపోయాడు. తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పొట్టకూటి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
రొళ్ల: పొట్టకూటి కోసం వలస వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. రొళ్ల మండలం హెచ్.టి.వడ్రహట్టికి చెందిన అనితమ్మ, వెంకటేష్ దంపతులకు ఒక కుమారుడు, ఒకుమార్తె ఉన్నారు. కుమారుడు గిరిష్ (19) బెంగళూరులోని మల్లేశ్వరంలో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే బలగలగుంటలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్రవాహనంలో ఇంటికి బయల్దేరాడు. మార్గం మధ్యలో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో గిరిష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మల్లేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment