కడప రూరల్, న్యూస్‌లైన్: జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. స్థానిక రాజీవ్‌గాంధీనగర్ మున్సిపల్ కమ్యూనిటీ హాలులో ఆరవ విడత పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ జిల్లాలో 29 లక్షల మంది జనాభా ఉండగా, అందులో 3.17 లక్షల మంది పిల్లలను గుర్తించామన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 3.54 వేల పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 72 మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించే పిల్లల కోసం ప్రత్యేకంగా 18 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని వారి కోసం సోమ, మంగళ వారాల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పక రెండు చుక్కలు వేయించాలన్నారు. మళ్లీ రెండవ విడత పల్స్‌పోలియో కార్యక్రమం ఫిబ్రవరి 24వ తేదీన ఉంటుందన్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా, పోలియో చుక్కలు ఎన్నిమార్లు వేయించినా, పోలియో లక్షణాలు ఉన్నా, లేకపోయినా తప్పక రెండు చుక్కలు వేయించాలని సూచించారు.
గత మూడు సంవత్సరాల నుంచి ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని, ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ 0-5 సంవత్సరాల వయస్సులోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకోటిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ హరిత, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాసు పోలియో చుక్కలను వేశారు. కార్యక్రమంలో డీఐఓ నాగరాజు, నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వినోద్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు
Published Mon, Jan 20 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement