మృత్యుశకటం
Published Fri, Jan 17 2014 3:04 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM
గజపతినగరం, న్యూస్‌లైన్: పెద్దపండగ. ఇంటినిండా చుట్టాలు, బంధువులతో సరదాగా గడపాల్సిన రెండు కుటుంబాల్లో లారీ రూపంలో విషాదం అలుముకుంది. గజపతినగరం మండలంలోని మధుపాడ జంక్షన్ వద్ద జాతీయరహదారిని ఆనుకుని ఉన్న ఎస్సీ కాలనీలో ఓ పూరిపాక పైకి లారీ దూసుకురావడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విశాఖపట్నం నుంచి సాలూరు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ అదుపు తప్పి దూసుకు రావడంతో పాక దగ్గర సిమెంట్ దిమ్మైపై కూర్చుని మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు లారీ కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గ్రామానికి చెందిన రజక వృత్తిదారుడు తామాడ అప్పన్న (42)ఎస్సీ కాల నీకి చెందిన నగర అసిరయ్య (35)లు గురువారం తెల్లవారు జామున పనుల్లోకి వెళ్లేందుకు వచ్చి టీ తాగుతూ కష్టసుఖాలు మాట్లాడుకుంటుండగా అంతలో సిమెంట్ లారీ అదుపు తప్పి దూసుకు వచ్చింది.
అప్పన్న వెంట అతని కుమారుడు అనిల్ కూడా ఉన్నాడు. ఆకస్మికంగా లారీ తమ వైపు దూసుకు రావడంతో గమనించిన అప్పన్న కుమారుడిని దూరంగా విసిరివేయడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. అప్పన్న,అసిరయ్యలు లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. మృతి చెందిన తామాడ అప్పన్నకు భార్య అప్పయ్యమ్మ, కుమార్తె లక్ష్మి, కుమారు అనిల్ ఉండగా, అసిరయ్యకు భార్య వెంకటలక్ష్మి, ఏడాది వయస్సు గల సునీల్ కుమార్‌లు ఉన్నారు. అప్పన్న పురిటిపెంట న్యూకాలనీలో లాండ్రీదుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తుండగా అసిరయ్యరైల్వే కాలనీలో గల గంగా భవాని వాటర్ ప్లాంట్‌లో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ కుటుంబాలకు జీవనాధారమైన ఇద్దరిని మృత్యువు కబళించడంతో ఆయా కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
శోకసంద్రంలో మునిగిన గ్రామం
మృతుల కుటుంబాల రోదనలతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పండగ సందర్భంగా ఇంటినిండా చుట్టాలు ఉండడంతో గజపతినగరం వెళ్లి బజారు చేసుకుని వస్తానని రోడ్డు మీదకు వెళ్లి మృత్యువాత పడ్డావా అంటూ అసిరయ్య భార్య వెంకటలక్ష్మి బోరున విలపించింది. పిల్లలను, నన్ను అనాథలను చేసి వెళ్లిపోయావా అంటూ విలపిస్తుంటే పలువురు కంటనీరు పెట్టారు. తామాడ అప్పన్న రోజూ లాగానే గజపతినగరం వెళ్లినప్పుడు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి రోడ్డు మీదకు రాగానే మృత్యువాత పడడంతో భర్త సాయంత్రానికి ఇంటికి వస్తాడనుకుంటే ఇలా నన్ను,పిల్లలను అనాథలను చేసి పోయాడంటూ భార్య అప్పయ్యమ్మ విలపించింది. నాన్న ఏడని అప్పన్న పిల్లలు అడుగుతుంటే చుట్టుపక్కల వారి గుండెలు తల్లడిల్లాయి.
సహాయక చర్యలు ఆలస్యం ...
తెల్లవారు జామున లారీ పాకలోకి దూసుకు రావడంతో పక్కనే ఉన్న చెట్లు కూడా విరిగిపడ్డాయి. దీంతో ప్రమాదంలో లారీ కింద ఇరుక్కున్న మృత దేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఉదయం జరిగిన ప్రమాదంలో మృత దేహాలను బయటకు తీసేందుకు మధ్యాహ్నం వరకు శ్రమించి క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించి బయటకు తీశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఐ వి. చంద్రశేఖర్‌తో పాటు ఎస్సై. టి. కామేశ్వరరావు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి పడాల అరుణ, లోక్‌సత్తా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బెవర ఈశ్వరరావు పరామర్శించి ఓదార్చారు.
Advertisement
Advertisement