చీడికాడ/గోపాలపట్నం ,న్యూస్‌లైన్: వివాహవేడుకల్లో వారంతా ఆనందగా గడిపారు. సమీపంలోని జలాశయానికి విహారయాత్రకు వెళ్లిన వారిపై విధి కన్నెర్ర చేసింది. బోటులో షికారు చేయకముందే ఇద్దరిని అందని తీరాలకు చేర్చింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా పెళ్లి సందడిలో మునిగి తేలిన వారంతా అంతలోనే కన్నీరుమున్నీరయ్యారు.
విశాఖ గోపాలపట్నం శివారు కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన ముస్లింలు చీడికాడ మండలం శిరిజాంలో వివాహానికి శుక్రవారం హాజరయ్యారు. అక్కడ మధ్యాహ్నం భోజనాలు చేశాక కోనాం జలాశయాన్ని చూడ్డానికి వెళ్లారు. అందులో బోటు షికారుకు ఆసక్తి చూపారు. ఒడ్డున ఉన్న ఒక మత్స్యకారుడి బోటులోకి ఎనిమిదిమంది మహిళలు ఎక్కి కూర్చున్నారు. అంతా ఒకే వైపునకు వెళ్లడంతో సుమారు 30 అడుగుల లోతున నీటిలోకి ఒరిగిపోయింది. మహిళలంతా జలాశయంలో పడిపోయారు.
వారిలో ముగ్గురిని బోటు డ్రైవర్ రంసాల దేముడు, మరో ముగ్గురిని వారితో వచ్చిన యువకులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. షేక్ యాస్మిన్ (15), షేక్ ముంతాజ్ బేగం(30)లు గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు వలలతో గాలించగా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో యాస్మిన్ మృతదేహం బయటపడింది. మరో అరగంట తరవాత ముంతాజ్‌బేగం మృతదేహం దొరికింది. ఏకైక కుమార్తె యాస్మిన్ కళ్లముందే చనిపోవడంతో తండ్రి పీర్‌సాహెబ్‌ను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. బోటు షికారుకి తీసుకొచ్చిన భార్య ముంతాజ్‌బేగం నీటిలో మునిగిపోవడం కళ్లారా చూసిన భర్త మస్తాన్ వేదన వర్ణనాతీతం.
ఇక అమ్మ లేదని ఇద్దరు పిల్లలకు ఎలా చెప్పేదంటూ అతడు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. బంధువులు, స్థానికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. విషయం తెలుసుకున్న కోనాం వైఎస్సార్ సీపీ నాయకులు జి.సత్యనారాయణరాజు, రెడ్డి సన్యాసినాయుడులు జలాశయం వద్దకు చేరుకొని బాధితులను ఓదార్చారు. ఈ సమాచారంతో గోపాలపట్నం నాగేంద్రకాలనీలో విషాదం అలుముకుంది. చీడికాడ ట్రైనీ ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి ఆస్పత్రికి తరలిస్తామన్నారు.
తరచూ ప్రమాదాలు
జిల్లాలో విహార యాత్రకు కోనాం జలాశయం ప్రాంతానికి మంచి గుర్తింపు. కానీ తరచూ నాటుపడవల ప్రమాదాలతో విషాదం చోటుచేసుకుంటోంది. 1996లో ఇదే జలాశయంలో బోటు బోల్తాపడి 21మంది గిరిజనులు చనిపోయారు. గత ఎనిమిదేళ్లలో పలు ప్రమాదాల్లో మరో 15మంది వరకు మృత్యువాతపడ్డారు.
విషాదం
Published Sat, Aug 31 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement