పందిట్లో పెళ్లి ఉంది... టీవీలో మ్యాచ్ ఉంది!
ఫిబ్రవరి 15
జయనామ సంవత్సరం మాఘమాసం బహుళశుద్ధ ఏకాదశి అనగా ఫిబ్రవరి 15వ తేదీన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ పెళ్లిసందడి ఫుల్‌గా ఉంది. ఆదివారం కూడా కావడంతో ఈ సందడికి మరింత శోభ కనిపిస్తోంది! అయితే ఈ ఘడియలకు ఎంతో ఉత్సాహంగా రెడీ అయిపోతున్న కుర్రకారులో ఇప్పుడు కొత్త చింత మొదలైంది. ఇదే ముహూర్తానికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండడంతో మొదలైన చింత అది. ఐసీసీ ఎప్పుడో వేసిన షెడ్యూల్‌లో ఏరికోరి ఆదివారం రోజున ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ను సెట్ చేసింది. ఆవిధంగా విద్యార్థులు, ఉద్యోగులు సెలవు పెట్టేయాల్సిన అవసరాన్ని తప్పించింది.
అయితే ఈ హాలిడే మంచి ముహూర్తం కూడా కావడంతో పెళ్లిళ్లు షెడ్యూల్‌లోకి వచ్చేశాయి! సగటు క్రికెట్ అభిమానికి ఇంతకన్నా విపత్కరస్థితి ఉండదేమో! మ్యాచ్చా... మ్యారేజా.. అనే విషయాన్ని తేల్చుకోవాల్సిన సంకటంలో పడ్డారు. భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదింటికే మ్యాచ్ మొదలవుతుంది. పెళ్లిళ్లు కూడా అదే సమయంలో జరుగుతాయి. ఒకవేళ మ్యాచ్ కోసమని చెప్పి పెళ్లిళ్లకు డుమ్మా కొట్టేస్తే దగ్గరవాళ్ల దృష్టిలో అంతకు మించి
ద్రోహమూ ఉండదాయె!
ఇప్పుడెలా అంటే.. దీనికో పరిష్కారం ఉంది. చరిత్ర చూపిన పరిష్కారం అది. వరల్డ్‌కప్ సీజనే మన సమీప బంధువుల శుభకార్యాలకూ సీజన్ అయితే అలాంటి సందర్భాల్లో శుభకార్యపు వేదికల వద్ద టీవీలు ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. ఇప్పుడు కూడా దాన్ని ఫాలో అయితే చాలు! ఈ బాధ్యతను వధూవరులకే అప్పగించేస్తే.. కల్యాణ మండపంలో టీవీ ఉంటేనే పెళ్లికి వస్తాం... మరి మీ ఇష్టం.. అని ఒక హెచ్చరిక జారీ చేస్తే టెన్షన్ తగ్గిపోతుంది.