గుత్తి: కావేరి ఫుష్కర స్నానాలు చేసి వారంతా ఎంతో సంతోషంగా గడిపారు. తిరిగి గమ్యస్థానాలకు వెళ్తుండగా మార్గంమధ్యలో వారి వాహనం బోల్తా పడింది. అనంతరపురం జిల్లా గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామ శివార్లలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ ఘట్‌కేసర్‌కు చెందిన కళా శారద(60), సోదరి విజయలక్ష్మి, సొహైల్, విశ్రాంత ఉద్యోగి కళా లక్ష్మణరావు(65), భార్య అనురాధ, శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణారెడ్డి, అల్వాల్ లోతుకుంటకు చెందిన భార్యభర్తలు సత్యనారాయణ, అరుణలు ఈ నెల 15న హైదరాబాద్ నుంచి క్వాలిస్ వాహనంలో కర్ణాటకలోని శ్రీరంగపట్టణంలో జరుగుతున్న కావేరి పుష్కరాలకు వెళ్లారు.
శ్రీనివాస్, సొహైల్‌లు తప్ప మిగిలిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. శనివారం రాత్రి మైసూర్ నుంచి ఘట్‌కేసర్‌కు బయలుదేరారు. తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డుకు కుడివైపు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి రోడ్డు మధ్యలో డివైడర్‌పై అగిపోయింది. వాహనం నుంచి భారీగా పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన యువకులు వాహనాన్ని అపి స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
శారద(60) అప్పటికే మృతి చెందగా లక్ష్యణరావు(65) తీవ్రంగగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. తీవ్రంగా గాయపడిన వారు రక్షించండి అంటూ హాహాకారాలు చేశారు. 40 నిమిషాల పాటు 108 వాహనం కోసం ఎదురు చూసిన రాకపోవడంతో ఆ ముగ్గురు యువకులు తమ వాహనంలోనే లక్ష్మణరావును ఆస్పత్రికి తరలించారు. చికిత్సపారంభించేలోపే ఆయన మృతిచెందాడు. లక్ష్మణరావు, శారదలు వరుసకు అన్నాచెల్లెళ్లు. మిగతా క్షతగాత్రులను హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
ఆ దారుణానికి నిద్రమత్తే కారణం ..
Published Sun, Sep 17 2017 6:13 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM
Advertisement