ఎవరది ! | Two student anesthetic injections | Sakshi
Sakshi News home page

ఎవరది !

Published Sun, Aug 23 2015 5:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

Two student anesthetic injections

మొహానికి ముసుగు ధరించాడు. మత్తు ఇంజెక్షన్లతో మోటార్ సైకిల్‌పై రయ్యిమంటూ దూసుకొచ్చాడు. కూతవేటు దూరంలోనే వేర్వేరుచోట్ల ఇద్దరు విద్యార్థినుల్ని ఆపాడు. ఏం చదువుతున్నారని అడిగాడు. వెంటతెచ్చిన మత్తు ఇంజెక్షన్లను క్షణాల్లో వారి శరీరంపై గుచ్చాడు. బాలికలు కేకలు వేయడంతో.. పొలాల్లోంచి రైతులు, కూలీలు, చుట్టుపక్కల జనం రావడంతో ఉడాయించాడు. వచ్చిన ఆగంతకుడు ఎవరు.. విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్లు ఎందుకు ప్రయోగించాడో అంతుచిక్కడం లేదు. ఉండి మండలం యండగండి ప్రాంతంలో శనివారం ఉదయం 15 నిమిషాల వ్యవధిలో రెండుచోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనలు విద్యార్థినుల తల్లిదండ్రులను, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి.
 
 
 ఉండి/పాలకోడేరు : యండగండి-మైప గ్రామాల మధ్య యనమదుర్రు డ్రెయిన్ వంతెన ప్రాంతమది. మైప గ్రామానికి చెందిన అందుకూరి మెర్సీ (13) యండగండి హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. ఎప్పటిలా శనివారం ఉదయం సైకిల్‌పై హైస్కూల్‌కు బయలుదేరింది. మెర్సీ యనమదుర్రు డ్రెయిన్ వంతెన సమీపంలోకి చేరుకోగా.. మొహానికి ముసుగు వేసుకున్న యువకుడు మోటార్ సైకిల్‌పై వెళ్లి బాలికను అటకాయించాడు. ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. బాలిక సమాధానం చెప్పేలోగానే తన చేతిలోని ఇంజెక్షన్‌తో ఆమె నడుం భాగంలో పొడిచాడు. సిరంజిలోని మందును శరీరం లోపలికి ప్రయోగించాడు. మెర్సీ బిగ్గరగా కేకలు వేయటంతో చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా, మెర్సీని యండగండిలో పీహెచ్‌సీకి తరలించారు.
 
 పావుగంట వ్యవధిలో అక్కడకు కిలోమీటరున్నర దూరంలోనూ ఇలాం టి ఘటనే చోటుచేసుకుంది. యండగండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న అదే గ్రామంలోని రాయనివానిగూడెంకు చెం దిన గుత్తుల వెంకటవరలక్ష్మి (16) సైకిల్‌పై కళాశాలకు వెళ్తుండగా.. అదే యువకుడు బైక్‌పై వెళ్లి ఆమెను అటకాయించాడు. ఏం చదువుతున్నావని అడిగాడు. సమాధానం చెప్పేలోపే ఆమె వంటిపైనా మత్తు ఇంజెక్షన్ పొడిచాడు. ఎందుకు ఇంజెక్షన్ చేశావని వరలక్ష్మి ప్రశ్నించగా.. ఇంకో ఇంజెక్షన్ చేస్తానని బెదిరించాడు. వరలక్ష్మి బిగ్గరగా అరవటంతో సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు, బాలిక తాతయ్య పరుగు పరుగున అక్కడికి చేరుకోగా.. ఆగంతకుడు పరారయ్యాడు. అతణ్ణి పట్టుకునేందుకు యండగండి గ్రామస్తులు బృందాలుగా విడిపోయి గాలించినా ప్రయోనం లేకపోయింది.
 
 బాలికలిద్దరికీ తొలుత యండగండి పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స చేయిం చారు. వారిపై మత్తు ఇంజెక్షన్ల ప్రయోగం జరిగిందని గుర్తించిన వైద్యులు ఇద్దరినీ భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలికలిద్దరూ కోలుకున్నారని వైద్యులు తెలిపారు. గుర్తు తెలియని యువకుడు బాలి కల్ని కిడ్నాప్ చేసేందుకు ఇంజెక్షన్లు ఇచ్చాడా లేక ఇది సైకో చర్యా.. లేక మరేదైనా కారణం ఉందా అనేది తేలలేదు. ఈ ఘటనతో విద్యార్థినుల తల్లిదండ్రులు కలవరపడ్డారు. తమ పిల్లల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు పాఠశాలలు, కళాశాలలకు తరలి వెళ్లడం కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు.
 
 వివిధ కోణాల్లో దర్యాప్తు
 ఇద్దరు విద్యార్థినులపై మత్తు ఇంజెక్షన్ల ప్రయోగించిన ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు ఉండి ఎస్సై రవివర్మ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినులపై కక్షతో ఆగంతకుడు ఈ ఘటనలకు పాల్పడ్డాడా లేక అతడు సైకోనా.. మరేదైనా కారణం ఉందా అనేవి అంతుబట్టని ప్రశ్నలుగానే ఉన్నాయి. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యండగండి సరిహద్దు గ్రామాలతోపాటు భీమవరం పరిసర ప్రాంతాల్లో పోలీస్ యంత్రాంగం నిఘా పెట్టింది. మఫ్టీలో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జిల్లా సరిహద్దుల్లోనూ ముసుగు వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
 
 కోలుకుంటున్న విద్యార్థినులు
 భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మెర్సీ, వరలక్ష్మి కోలుకుంటున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రభుత్వాసుపత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ కె.ప్రభాకరరావు చెప్పారు. ఇంటర్మీడియెట్ విద్యార్థిని వరలక్ష్మికి బీపీ సాధారణ స్థాయికంటే తక్కువగా ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వారు కోలుకున్న అనంతరం రక్త పరీక్షలు చేసి వారిపై ప్రయోగించిన మత్తు ఇంజెక్షన్ల స్థాయి ఏమిటి, వాటి ప్రభావం ఏమిటనే విషయాలను పరిశీలిస్తామని సూపరింటెండెంట్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement