
మిత్రులను మింగిన మృత్యువు
► సుంకేసుల వద్ద నీటిలో పడి ఇద్దరు
► విద్యార్థుల దుర్మరణం
► రెండు కుటుంబాల్లో విషాదం
సుంకేసుల(గూడూరు రూరల్): హాలీ పండగ రెండు కుటుంబీల్లో విషాదం నింపింది. సంబరాల అనంతరం స్నానాలు చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు సుంకేసుల బ్యారేజీ వద్ద నీటి గుంతలో పడి మృత్యువాతపడ్డారు. కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు బుధవారం హోలీ సంబరాల్లో సంతోషంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం 4గంటల ప్రాంతంలో స్నానాలు చేసేందుకు సుంకేసుల బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. మొదట 8 మంది విద్యార్థులు బ్యారేజీ 29వ వెంట్ సమీపంలోని నీటిలో స్నానాలకు దిగారు.
సాయంత్రం చీకటి పడే సమయంలో కర్నూలులోని వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న ట్రాన్స్‌కో ఉద్యోగి రాఘవేంద్రప్రసాద్, అరుణమ్మ దంపతుల కుమారుడు చైతన్య, పింజరి వీధిలో నివాసం ఉంటున్న పెయింటర్ పల్నాటిశివ, పద్మ దంపతుల కుమారుడు భార్గవ్ కనిపించలేదు. దీంతో స్నేహితులు వారి ఆచూకీ కోసం చుట్టు పక్కల గాలించారు.
చివరకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆందోళనతో రాత్రంతా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం 29వ గేటు వద్ద వారంతా స్నానం చేసిన చోటనే మిత్రుల చెప్పులు నీటిపై తేలియాడంతో అనుమానంతో ఈతగాళ్లతో గాలించారు. చైతన్య, భార్గవ్ మృతదేహాలు లభించాయి. సంఘటన స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.