
సాక్షి, తూర్పుగోదావరి : అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో గురువారం విషాదం చోటు చేసుకుంది. అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సానబోయిన హరి(19) ఓడలరేవు సముద్రంలో స్నానం చేస్తూ భారీ అలలకు మునిగి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం బొండాయికోడుతూము గ్రామానికి చెందిన హరి తోటి విద్యార్థులతో పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యాడు. అమలాపురం మండలం పేరూరు పల్లపు వీధికి చెందిన గంటి శివ(19) హరితో పాటుగా స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్‌కేబీఆర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 మంది విద్యార్థులు, తోటి స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల నిమిత్తం ఓడలరేవు బీచ్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు కావలసిన భోజన సదుపాయాలు తమతో బీచ్‌కు తీసుకెళ్లారు.
తోటి విద్యార్థి పుట్టిన రోజు వేడుక పూర్తి చేసుకుని సముద్ర రిసార్ట్సు సమీపంలో సముద్రంలో స్నానానికి దిగారు. ఆ సమయంలో భారీ అలల ఉధృతికి సానబోయిన హరి, గంటి శివ గల్లంతయ్యారు. తమతో స్నానాలు చేస్తున్న హరి, శివలు కనిపించకపోవడంతో తోటి విద్యార్థుల్లో విషాదం అలుముకుంది. ఇంతలో భారీ అలలకు సానబోయిన హరి మృతదేహాం ఒడ్డుకి కొట్టుకొచ్చింది. అప్పటి వరకు సరదాగా తమతో గడిపి అంతలోనే విగతజీవుగా కనిపించడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరో విద్యార్థి గల్లంతైన శివ జాడ కోసం విద్యార్థులు నిరీక్షించడం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు.
ఈ సంఘటనపై అల్లవరం పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఎస్సై కె.చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్‌కేబీఆర్ కాలేజీ నుంచి పుట్టిన రోజు పార్టీ నేపథ్యంలో బీచ్‌కు వచ్చిన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. సముద్రంలో గల్లంతైన శివ ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు, గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు అడ్డంకి మారిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు.
విద్యార్థుల గల్లంతుపై కోనసీమ జాక్ సంతాపం
ఓడలరేవు సముద్రంలో స్నానానికి దిగి మృతి చెందిన హరి, గల్లంతైన శివ పట్ల కోనసీమ జాక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఓడలరేవులో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరిగి విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని, ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment