
కూలీలను బలిగొన్న మినీ లారీ
పొట్టకూటి కోసం కూలి పనులకు బయలుదేరిన ఇద్దరు మహిళా కూలీలను మినీ లారీ రూపంలో మృత్యు వు కబళించింది. కుటుంబం కోసం పొలాల్లో కాయకష్టం చేస్తున్న రేలంగి రత్నం
కొవ్వూరు రూరల్ :పొట్టకూటి కోసం కూలి పనులకు బయలుదేరిన ఇద్దరు మహిళా కూలీలను మినీ లారీ రూపంలో మృత్యు వు కబళించింది. కుటుంబం కోసం పొలాల్లో కాయకష్టం చేస్తున్న రేలంగి రత్నం(42), గేడేలి సుబ్బమ్మ(48) మరణంతో కొవ్వూరు మండలం వాడపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. వాడపల్లికి చెందిన రేలంగి రత్నం, గుడేలి సుబ్బమ్మ పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. నిత్యం ఇద్దరూ కలసి వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. శనివారం ఉదయం 7గంటల సమయంలో భోజనం క్యారేజీలను పట్టుకుని ఏటిగట్టుపై గల ఆర్ అండ్ బీ రోడ్డుపై వారిద్దరూ నడిచి వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మినీ లారీ వారి మీదుగా దూసుకు పోయింది. తీవ్రగాయాల పాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి చేతిలోని అన్నం క్యారేజీలు వ్యాన్ ముందుభాగంలో ఇరుక్కుపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఆర్తనాదాలతో హోరెత్తిన ఘటనా ప్రాంతం
మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఘటనా ప్రాంతం హోరెత్తింది. మృతురాలు రత్నంను తలచుకుని ఆమె భర్త వీర్రాజు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిం చింది. మృతురాలు రత్నంకు ముగ్గురు కుమార్తెలు ఉండగా, అందరికీ వివాహాల య్యాయి. మరో మృతురాలు సుబ్బమ్మకు భర్త శ్రీరాములు, ఐదుగురు కుమార్తెలు ఉం డగా, ఇరువురు కుమార్తెలు మృతి చెందారు. గతంలో మృతి చెందిన రెండో కుమార్తె నాగలక్ష్మి పద్నాలుగేళ్ల కూతురు దుర్గను సుబ్బమ్మ పెంచుకుంటోంది. ఆమె మృతితో మనుమరాలు దుర్గ ఆనాథగా మారిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు, మాజీ సర్పంచ్ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు) చేరుకుని బాధిత కుటుంబాలకు సహకారం అందించారు.