మార్కాపురం రూరల్ : పశువులను మేపేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రమాదవశాత్తు అక్కడి నీటికుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వృద్ధురాలిని రక్షించబోయిన యువతి కూడా కుంటకు బలైంది. ఈ సంఘటన మండలంలోని తిప్పాయపాలెంలో జరిగింది. వివరాలు.. మండలంలోని మిట్టమీదపల్లెకు చెందిన కుందురు గాలెమ్మ (65), కుందురు లక్ష్మీదేవి (20)లు గేదెలను మేపుకుంటూ తిప్పాయపాలెం వెళ్లారు. ఆ గ్రామ సమీపంలోని జాతీయ రాహదారి పక్కనే ఉన్న బోయర్లకుంట(వాల్మీకి కుంట) వద్దకు వెళ్లారు. నీరు తాగించేందుకు గేదెలను కుంటలోకి తోలారు. మళ్లీ వాటిని బయటకు తోలేందుకు గాలెమ్మ ప్రయత్నించి కుంటలో చిక్కుకుని బయటకు రాలేకపోయింది.
ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన లక్ష్మీదేవి కూడా కుంటలో మునిగి గాలెమ్మతో పాటు ప్రాణాలు కోల్పోయింది. గాలెమ్మ స్వగ్రామం తిప్పాయపాలెం. ఆమె కుమార్తె పద్మావతిని మిట్టమీదపల్లెకు చెందిన వెన్నా సుబ్బారెడ్డికిచ్చి వివాహం చేసింది. అప్పటి నుంచి ఆమె మిట్టమీదపల్లెలోనే కుమార్తె వద్ద ఉంటోంది. కుమార్తె కుటుంబానికి చెందిన గేదెలను మేపుతూ ఉంటోంది. ఈ నేపథ్యంలో కుంటలో మునిగి లక్ష్మీదేవితో పాటు ప్రాణాలు కోల్పోయింది.
లక్ష్మీదేవికి వివాహం కాలేదు. తండ్రి పాపిరెడ్డికి ఆమె రెండో కుమార్తె. ఈమెతో పాటు పాపిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిద్దరి మృతి పట్ల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాలెమ్మ కుమార్తె పద్మావతి దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది. సీఐ శివరామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై దేవకుమార్‌లు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఆమెను రక్షించబోయి.. ఈమె కూడా..
Published Sun, Aug 3 2014 3:14 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement