చిట్టితల్లి లేదిక.. | two years child died | Sakshi
Sakshi News home page

చిట్టితల్లి లేదిక..

Published Wed, Dec 10 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

చిట్టితల్లి లేదిక..

చిట్టితల్లి లేదిక..

అనంతపురం క్రైం :  మొన్నటి వరకు తల్లి ఒడిలో హాయిగా నిద్రించింది.. తండ్రి భుజాలపై కూర్చుని సంతోషంగా గడిపింది. చుట్టుపక్కల చిట్టిపొట్టి చిన్నారులతో కలిసి అల్లరి చేసింది. అలాంటి చైత్ర ఆడుకుంటూ వెళ్లి కన్పించకుండాపోయింది. చిట్టితల్లి కోసం రెండ్రోజుల పాటు ఆ తల్లిదండ్రులు వెతకని ప్రాంతమంటూ లేదు. కన్పించిన వారినంతా ‘మా లవ్‌లీ కన్పించిందా’ అంటూ అడిగారు. ఎవరూ జాడచెప్పలేకపోయారు. మంగళవారం ఉదయాన్నే గుండెలు పిండేసే విషాదం.. కన్పించకుండా పోయిన చైత్ర మురుగు కాలువలో మృతదేహంగా కన్పించడం చూసి తట్టుకోలేకపోయారు.
 
గుండెలవిసేలా రోదించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ఖాజానగర్‌కు చెందిన సీహెచ్ శ్యాంసుందర్, సరళ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. శ్యాంసుందర్ ‘హీరో’ షోరూంలో పని చేస్తున్నారు. చిన్న కుమార్తె చైత్ర అలియాస్ లవ్ లీ (2) ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ కన్పించకుండాపోయింది. పాప కోసం తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో.. కాలనీలో వెతికినా ఫలితం లేకపోయింది. రెండ్రోజులైనా పాప జాడలేకపోయింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు మంగళవారం ఉదయం ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో వెతికారు. కొద్ది సేపటి తర్వాత చైత్ర వేసుకున్న డ్రస్సు కన్పించడంతో దగ్గరికెళ్లి చూశారు. చిన్నారి వృతదేహం కన్పించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్నటి వరకు వచ్చీరాని మాటలతో ఇంటిల్లిపాదినీ అలరించిన చిట్టితల్లి కానరాని లోకాలకు వెళ్లిందని తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపించారు. వృతి చెంది రెండ్రోజులు కావస్తుండడంతో పాప శరీరమంతా ఉబ్బిపోయింది. సమాచారం అందుకున్న మేయర్ మదమంచి స్వరూప, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, టీడీపీ నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డి, గోవిందరెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి తల్లిని ఓదార్చారు. వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

 కాలువను శుభ్రం  చేసే నాథులే లేరు..

నగరమంతా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రజాప్రతినిధులు అవకాశం వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చైత్రను మింగేసిన మురుగు కాలువను చూస్తే ఏ మేరకు నగర అభివృద్ధి జరుగుతోందో అర్థమవుతుంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాసం, విద్యా సంస్థల మధ్యనే ఈ కాలువ ఉంది. అయినా దీన్ని శుభ్రం చేయించే నాథుడే కరువయ్యారు. ఇదే విషయంపై మేయర్, కమిషనరును మంగళవారం స్థానికులు నిలదీశారు. ‘మీఇళ్ల వద్ద ఇలాగే ఉంటే భరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. అరగంట పాటు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది పడతారని, అలాంటిది తాము 24 గంటలూ ఎలా కాపురం చేస్తున్నామో ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మురుగు కాలువను శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు.                 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement