కాకినాడ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ నియమితులయ్యారు. గుంటూరు జిల్లా వెలంపాడుకు చెందిన ఉదయభాస్కర్ గతంలో కాకినాడ, విజయనగరాల్లోని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్‌గా, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, విదేశీ విశ్వవిద్యాలయ సంబంధాల డెరైక్టర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన్ను వీసీగా నియమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి దక్కింది.
ఈ సందర్భంగా బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ మంచి ఇంజనీర్లను తయారుచేసి భావితరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దానని, ఇకపై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎంతోకాలంగా నిరుద్యోగులు కలలుకంటున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనను చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఙతలు తెలిపారు. ఉదయభాస్కర్‌ను వైస్ చాన్సలర్ వీఎస్‌ఎస్ కుమార్, రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు తదితరులు అభినందించారు.