జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన చైతన్య ఉద్దానం రైతాంగ సంక్షేమ సంఘ నాయకులు
పోలాకి(ప్రజాసంకల్పయాత్ర బృందం): తిత్లీ ప్రభావిత ఉద్దానం ప్రాంతంలో న్యాయం చేయాలని అడిగిన బాధితులకు అండగా ప్రశ్నించేవారందరిపైనా ప్రతిపక్షముద్ర వేశారని చైతన్య ఉద్దానం రైతాంగ సంక్షేమ సంఘనాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మందస మండలం బహడపల్లి వద్ద వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సంఘ నాయకులు, తిత్లీ బాధిత రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపరిహారం గుర్తించడంలోనూ.. పంపిణీ చేయడంలోనూ జరిగిన అక్రమాలపై ప్రశ్నించినందుకు కేసులుపెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు.
బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తే 16 మందిపై దేశద్రోహం కేసులు పెట్టారని చెప్పారు. తిత్లీ తుఫాన్ సమయంలో పర్యవేక్షణకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారుల అవగాహన లోపంతో అనేక అవకతవకలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఉద్దానం ప్రాంతంలో జీడి, కొబ్బరి పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. జీడిమామిడి బోర్డు స్థానికంగా ఏర్పాటయ్యేలా కృషిచేయాలని విన్నవించారు. ఉద్దానం అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మహేంద్రతనయపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ ద్వారా బొడ్డపాడు మీదుగా జంతిబందకు సాగునీరు ఇప్పించాలని కోరారు.
గతంలో వైఎస్సార్ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చినా ఆయన మరణానంతరం పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందిచిన ప్రతిపక్షనేత ఉద్దానం ప్రాంత రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంఘనాయకులపై పెట్టిన అక్రమ కేసులను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసిన వారిలో చైతన్య ఉద్దానం రైతాంగ సంక్షేమ సంఘం మందస మండల అధ్యక్షుడు మామిడి మాధవరావు, నాయకులు బాబూరావు, ముకుందరావు, హడ్డి, తులసయ్య, కృష్ణారావు, సోమనాథం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment