
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రజాశీస్సులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రముఖ సిద్ధాంతి విష్ణుభట్ల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలను అమరావతిలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుభట్ల లక్ష్మీనారాయణ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేశారు. పంచాంగం ప్రకారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రహబలం బాగుందని, ఆయనకు అధికార యోగం ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆయన విశేష ప్రజాదరణ పొందుతారని చెప్పారు. అలాగే సమర్థవంతమైన పరిపాలన అందిస్తారని ఉద్ఘాటించారు. జగన్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధిస్తారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డిది ఆరుద్ర నక్షత్రం అయినందున ఈ ఏడాది ఆయనకు వృద్ధి అధికంగా ఉంటుందన్నారు. ఆయన హయాంలో వర్షాలు సకాలంలో కురుస్తాయన్నారు. దాంతో రాష్ట్రంలో పంటలు బాగా పండుతాయని, అదే సమయంలో గిట్టుబాటు ధరలు లభించి రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరిపించి వాటిని లాభాల్లో నడిపిస్తారని సిద్ధాంతి చెప్పారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా ఉన్నా అవి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి. అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధిస్తారు. జగన్ హయాంలో రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అధికారులు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తారు’’ అని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలు పదిలంగా ఉంటాయని సిద్ధాంతి తెలిపారు. సిమెంట్, ఐరన్ ధరలు పెరుగుతాయన్నారు. కళాకారులు, సినిమా రంగంలో ఉన్నవారు, గాయనీ, గాయకులకు ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
ప్రజల జీవితాల్లో ఆనందం విరియాలి: వైఎస్ జగన్
తెలుగువారి తొలి పండుగ ఉగాది ప్రజల జీవితాల్లో ఆనందం తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. తెలుగు వారికి ఆయన ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించిన వేదపండితులను జగన్ శాలువా కప్పి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment