సాక్షి, హైదరాబాద్: ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఏటా ఇచ్చే పతకాలను ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ కలిపి 309 మందికి వివిధ పతకాలు దక్కాయి. ఖమ్మం జిల్లా చింతూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తోటిచర్ల స్వామి, ఉగ్రవాద వ్యతిరేక విభాగం సీఐ సెల్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ కె.శ్రీనివాసులు, మావోయిస్టుల వ్యతిరేక విభాగం ఎస్‌ఐబీలో పనిచేసిన ఇన్‌స్పెక్టర్ రవీందర్, ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్‌ఎస్‌ఐ ఎన్ నాగేశ్వరరావులకు ముఖ్యమంత్రి శౌర్యపతకాలు లభించాయి.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల డీఎస్పీ డి.నర్సయ్య, సీఐడీలో పనిచేస్తున్న డీఎస్పీ ఎస్.త్రిమూర్తులు, ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఎస్సై ఎస్.సన్యాసిరావులకు మహోన్నత సేవా పతకం లభించింది. వీరితోపాటు 37 మందికి ఉత్తమ సేవా పతకం, 30 మందికి కఠిన సేవా పతకం, 160 మందికి పోలీసు సేవా పతకం లభించాయి. మరోవైపు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 13 మందికి పోలీసు సేవా పతకం లభించాయి. అగ్ని మాపకశాఖలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురికి ఉత్తమ సేవా పతకం, 25 మందికి సేవా పతకం లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విం గ్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్-కానిస్టేబుల్ కె.ప్రభాకర్ మహోన్నత సేవా పతకం పొందారు. ఈ విభాగంలో మరో ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, పదిమందికి సేవా పతకం లభించాయి. అవినీతి నిరోధక శాఖలో పని చేస్తున్న ఏఎస్సై జి.పరమానందం మహోన్నత సేవా పతకం పొందగా... మరో ముగ్గురు ఉత్తమ సేవ, 12 మంది సేవా పతకాలు పొందారు.