ఉమ్మారెడ్డి చరిత్ర సృష్టించారు..
పట్నంబజారు(గుంటూరు) : జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చరిత్ర సృష్టించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ కొనియాడారు. ఉమ్మారెడ్డి సన్మానసభలో ఆయన మాట్లాడుతూ శాసనమండలిలో ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడతారన్నారు. ఈ నెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మారెడ్డి ఎన్నికతో శాసన మండలికే శోభ వచ్చిందన్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు గెలవలేమని భయపడే రెండో అభ్యర్థిని నిలపలేదన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చ లేని వ్యక్తి ఉమ్మారెడ్డి అని కొనియాడారు. గన్నవరం పార్టీ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మారెడ్డి ఎన్నిక పార్టీని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. గుంటూరు నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నగర విభాగం ఆధ్వర్యంలో కూడా ఉమ్మారెడ్డిని ఘనంగా సన్మానిస్తామని తెలిపారు.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరైన నిర్ణయం తీసుకుని ఉమ్మారెడ్డి లాంటి అనుభవశాలికి పట్టం కట్టారన్నారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతూకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఏకగ్రీవ ఎంపికతో టీడీపీ మూటాముల్లె సర్దుకుందని ఎద్దేవా చేశారు.తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మారెడ్డి కార్యదక్షతను ప్రతి నాయకుడు తెలుసుకోవాలన్నారు.
వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీడీపీ నేతల దురాగతాలను శాసనమండలిలో ఎండగట్టాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికార జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. సన్మానం సందర్భంగా కొత్తా చిన్నపరెడ్డి బహూకరించిన పూల బాణాన్ని ఉమ్మారెడ్డి ఎక్కుపెట్టారు.