
ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం!
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. ఈ ఉప ఎన్నిక బరిలో నుంచి టీడీపీ తప్పుకున్నట్లు సోమవారం ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక ఏకగీవ్రం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏప్రిల్ 24న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో అమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి నవంబరు 8న ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియాజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు.
శాసనసభ్యులు మృతి చెంది.. పోటీలో వారి కుటుంబసభ్యులే నిలబడితే ఇతర పార్టీలు పోటీ చేయకూడదన్న సాంప్రదాయాన్ని అన్ని పార్టీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నికలో టీడీపీ కూడా సాంప్రదాయాన్ని కొనసాగించాలంటూ చేసిన విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టడం లేదని తక్షణమే ప్రకటించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే.. అందరూ అక్కడ పోటీ ఉండదని, ఏకగ్రీవం తప్పదని భావించారు.
అయితే ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేతలు నందిగామ ఎన్నికకు, ఆళ్లగడ్డ ఎన్నికకు సారూప్యత లేదని.. విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి వచ్చిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుతామని అన్నారు. ఆళ్లగడ్డ బరిలో ఉంటామని గత వారం రోజులుగా ఇదే విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా మీడియా సమావేశాల్లో వెల్లడించారు. టీడీపీ అధినేత తనయుడు లోకేష్ వద్ద ఇదే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే.
సాంప్రదాయాన్ని కొనసాగించే అంశంపై అన్ని పార్టీల నేతలతో చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్ నేతలైన ఎంవీ మైసూరరెడ్డి, ధర్మాన ప్రసాదరావులతో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కమిటీ నేతలు అన్ని పార్టీల నాయకులతో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక అంశంపై చర్చించారు. హుదూద్ తుపాన్‌తో ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నాక పార్టీ నేతలతో ఈ విషయమై చర్చించి.. సంప్రదాయానికి సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే.
సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడంతో గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సుముఖంగా లేన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలు కూడా సాంప్రదాయం వైపే మొగ్గుచూపుతూ నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడికి వదిలేశారు. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి సతీమణి డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఈ మేరకు సోమవారం సాయంత్రం మీడియాకు స్పష్టం చేశారు.