కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన నగదు బదిలీ పథకం వంటగ్యాస్ వినియోగదారులకు గుది బండగా మారింది. ఆధార్ అనుసంధానం చేయించుకున్న వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ రూపేణా జమయ్యే మొత్తం ఎంత అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెరిగిన ధర ప్రకారం సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ రూ.1,071 కాగా, ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారికి సబ్సిడీ రూపంలో రూ.612 బ్యాంక్ అకౌం ట్‌లో జమ అవుతోంది. అంటే సబ్సిడీ పోగా, వినియోగదారుడు రూ.459 చెల్లించాల్సి వస్తోంది.
అయితే, అనుసంధానం చేయించుకోని వారికి రూ.412కే గ్యాస్ సిలిం డర్ సరఫరా చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారు సిలిండర్‌కు రూ.47 నష్టపోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా దీపం గ్యాస్ కనెక్షన్లు సుమారు 1.70 లక్షలు, ఇతర వినియోగదారులు సుమారు 5.80 లక్షల వరకూ ఉన్నారని అంచనా. ఇప్పటివరకూ సుమారు 40 శాతం మంది వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేయించుకున్నారని అధికారులు చెబుతున్నారు. కొవ్వూరు గ్యాస్ ఏజెన్సీ పరిధిలో సుమారు 30 వేల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, సుమారు 17,200 మంది వినియోగదారులు మాత్రమే ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకున్నారు. ఇంకా సుమారు 12,800 మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయూల్సి ఉంది.
స్పష్టత లేని నగదు బదిలీ
అక్టోబర్ 1నుంచి జిల్లాలో ఆధార్ అనుసంధానం పూర్తి చేసుకున్న గ్యాస్ విని యోగదారులందరికీ నగదు బదిలీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అనుసంధానం పూర్తయినా కొందరి ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమ కావడం లేదు. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఆధార్ నంబర్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయించుకుంటేనే గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తామని, ఆ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో వినియోగదారుని ఖాతాలో నేరుగా జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఆధార్ అనుసంధానం చేయించుకోని వారికి సబ్సిడీ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది.
మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో అనుసంధానం ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. అయితే, ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని, ఆ ప్రక్రియ పూర్తిచేయని డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల అటు డీలర్లలోను ఇటు వినియోగదారులలోను అయోమయం నెలకొంది. ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమెయిలీ ఆధార్ అనుసంధానం పూర్తికాని వారికి సబ్సిడీ ధరకే గ్యాస్‌ను అందిస్తామని ప్రకటించారు. దీంతో అసలు ఆధార్ అనుసంధానం చేయించాలా, వద్దా అనే మీమాంసలో వినియోగదారులు కొట్టుమి ట్టాడుతున్నారు.