ప్రభుత్వ వ్యాపారానికి భూములివ్వం
స్పష్టం చేసిన ఉండవల్లి రైతులు
సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్ : ‘అమరావతిలో రాజధాని నిర్మాణం జరగట్లేదు. రైతుల పొట్టగొట్టి వ్యాపార సంస్థలకు మా భూములను కట్టబెడు తున్నారు. అలా కాదని చెబితే... రాజధానిలో ఏమి కడుతున్నారో చెప్పండి. ప్రజలకు, రాజధానికి, దేశానికి ఉపయోగపడేదే అయితే ఉచితంగా ఇచ్చేస్తాం. ప్రభుత్వ వ్యాపారాల కోసం అయితే భూములు ఇచ్చేది లేదు’ అని ఉండవల్లి రైతులు మరోసారి తేల్చిచెప్పారు. రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని భూములను బలవంతంగా సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీటీఆర్‌ఐ)తో సామాజిక ప్రభావ అంచనా సర్వే నిర్వహిస్తోంది.
అయితే ఆ సంస్థ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించకుండా, రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు నివేదికలు సిద్ధం చేస్తుండటంతో కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో ఈపీటీఆర్‌ఐ ప్రతినిధులు రాజధాని పరిధిలోని పలు గ్రామాల్లో సభలు నిర్వహి స్తున్నారు. ఈ సభల్లో రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఆదివారం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఉదయం 10 నుంచి సుమారు నాలుగు గంటలకు పైగా సాగిన సభలో ఈపీటీఆర్ ప్రతినిధులు, సీఆర్‌డీఏ అధికారులు రైతులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ జవాబు చెప్పలేకపోయారు. దీంతో తెల్లమొహం వేసిన అధికారులు, ఈపీటీఆర్‌ఐ ప్రతినిధులు వెనుదిరిగారు.
భూ సేకరణకు వీల్లేదు: ఎమ్మెల్యే ఆర్కే
రాజధానిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ భూ సేకరణ చేయడానికి వీల్లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) గ్రామ సభలో స్పష్టం చేశారు. భూసేకరణకు చట్టం ఒప్పుకోదని తేల్చిచెప్పారు. అసలు గ్రామ సభ నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. గ్రామ సభ తీర్మానం చేశాక ఈ సమావేశాలు నిర్వహించకూడదన్నారు. 2012లో గోవాలోని ఓ గ్రామంలో ప్రభుత్వం భూ సేకరణ చేయడానికి నిర్ణయించగా.. వీల్లేదంటూ గ్రామ సభ తీర్మానం చేసిందని, ఆ తీర్మానానికి సుప్రీంకోర్టు కూడా మద్దతు తెలిపిందని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి వ్యతిరేకం కాదని, అయితే ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు.