నేపాల్‌లో ఉండవల్లివాసులు!
♦ కుటుంబ సభ్యులు, బంధువుల్లో ఆందోళన
♦ క్షేమంగా ఉన్నారని తెలియటంతో ఊరట
తాడేపల్లి రూరల్ : నేపాల్‌లో భూకంపం సంభవించి భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్టు తెలియటంతో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శనివారం కలకలం రేగింది. నేపాల్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించటానికి ఉండవల్లి గ్రామానికి చెందిన 27 మంది వెళ్లటమే దీనికి కారణం. తమవారికేమైందోనని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా ఆందోళన చెందారు. వారి సమాచారం తెలుసుకునేందుకు అవస్థలు పడ్డారు. తొలుత ఎలాంటి సమాచారం తెలియక కన్నీటి పర్యంతమయ్యారు. చివరికి వారంతా క్షేమంగా ఉన్నట్టు తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామానికి చెందిన 22 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఈ నెల 20న నేపాల్ పర్యటనకు బయలుదేరారు. గోరఖ్‌పూర్ వరకు రైలులో వెళ్లినవారు అక్కడ్నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నేపాల్ చేరుకున్నారు. ఖాట్మాండులోని పశుపతినాథ్, ముక్తినాథ్ క్షేత్రాలకు వెళుతున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈలోగా టీవీ చానెళ్లలో భూకంపం వార్తలు రావటంతో ఆందోళన చెందారు. తమవారి ఫోన్లకు పలుమార్లు కాల్ చేశారు.
చివరికి తామంతా పోక్రా అనే ప్రాంతంలో ఉన్నామని, ఖాట్మండుకు వంద కిలోమీటర్ల దూరంలో నేపాల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో క్షేమంగా ప్రయాణిస్తున్నామని వారు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ ఎం.టి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వినోద్‌కుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని నేపాల్ యాత్రకు వెళ్లినవారి వివరాలు సేకరించారు. వారంతా క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో వారి పేర్లు నమోదు చేసుకుని వెళ్లిపోయారు.