
కేంద్ర జోక్యం హైదరాబాద్ జిల్లాకే పరిమితం చేయమని కోరాం
జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణలో పర్యటనకు వస్తే తామే అడ్డుకుంటామని పాల్వాయి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.
విభజన ప్రక్రియలో హైదరాబాద్ విషయంలో రెండు మూడు మెలికలు ఉన్నాయంటూ తానెవ్వరితో మాట్లాడలేదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తమతో చెప్పారని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ వివరించి చెప్పమని తమతో అన్నారన్నారు. బుధవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
నేతల భేటీ సమయంలో ఢిల్లీ పెద్దలు అనని మాటలను వాళ్ల అన్నట్టు సీమాంధ్ర ప్రాంత పార్టీ నాయకులు బయటకు వచ్చి విలేకరుల వద్ద చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి జిల్లా పరిధి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధులను వివరించి చెప్పి.. ఇక్కడి శాంతిభద్రతలను కేంద్రం పరిధిలోకి తీసుకునే అంశం కేవలం హైదరాబాద్ జిల్లాకే పరిమితం చేయాలని తాము షిండేకు సూచించినట్టు చెప్పారు. ఆంధ్ర ప్రాంత నాయకులు అబద్ధాలను చెబుతూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆ ప్రాంతంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే విషయంలో తమ పార్టీ నాయకులు జీరోలయ్యారన్నారు.
జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు బెయిల్ రావడంతో ఆయనా గజగజ వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రావడాన్ని తాము తప్పుపట్టడం లేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ఛార్జిషీటు వేయడం పూర్తయిన తరువాత కూడా జైలు ఉంచడం ఎలా సాధ్యమవుతుందన్నారు.
జగన్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటాం
జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణలో పర్యటనకు వస్తే తామే అడ్డుకుంటామని చెప్పారు. ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ ఉండే పరిస్థితే ఉండదన్నారు. తెలంగాణలో పర్యటించాలని ఆయన అనుకుంటే గతంలో ఆయన పర్యటించినప్పుడు ఏమి జరిగిందో అదే జరుగుతుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని, జగన్‌లాంటి వ్యక్తులకు ఇక్కడ ప్రాధాన్యత ఉండదని చెప్పారు. కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయంగా చంద్రబాబుకు నామరూపాలు లేకుండా చేసుకోమనండి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.