18వేల కోట్లు.. అయిదేళ్లు!
ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి
ఈనెల 20లోగా ప్రతిపాదనలు పంపండి
రానున్న పదేళ్లను దృష్టిలో పెట్టుకుని నివేదికలు సిద్ధం చేయండి
ఈఈలు, డీఈఈలు, ఏఈల సమీక్షలో పీఆర్ చీఫ్ ఇంజనీర్ రామ్మూర్తి
చిత్తూరు (టౌన్): ప్రత్యేక అభివృద్ధి పథకం కింద జిల్లాకు కేంద్ర ప్రభుత్వం రూ.18 వేల కోట్లను రానున్న అయిదేళ్లపాటు విడుదల చేయనుందని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ సీవీ.రామ్మూర్తి అన్నారు. ఈ ప్యాకేజీ అమలు, తీరుతెన్నులపై ఆయన, జిల్లా పరిషత్ సమావేశమందిరంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం ప్రత్యేక అభివృద్ధి పథకం ద్వారా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు కోస్తాలోని 40 మండలాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.
జిల్లాలోని గ్రావెల్ రోడ్లు, బీటీ రోడ్ల అభివృద్ధి కోసం ఈ ప్యాకేజీ కింద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. రానున్న పదేళ్లలో రోడ్ల వెడల్పు, పొడవును పెంచడం, కల్వర్టులు, బ్రిడ్జిల ఆధునికీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పల్లెల్లో రోడ్లు, కాలువలు, వీధుల్లో సిమెంటురోడ్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలను చేపట్టాలన్నారు. అసంపూర్తిగా వున్న భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. లింకు రోడ్లకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. జనావాసాలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ‘సీమ’లో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ పనులు చేపట్టాలన్నారు. సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఈనెల 20లోగా తమకు పంపాలని ఆదేశించారు.
పనుల్లో నాణ్యత పెంచండి
జిల్లాలో చేపట్టే పనుల్లో నాణ్యత పెంచాలని అధికారులకు చీఫ్ ఇంజనీర్ సీవీ.రామ్మూర్తి సూచించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల నాణ్యతపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇకపై చేసే పనుల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో తమ పరిధికి చెందిన రోడ్లకు నిర్మించిన కల్వర్టుల తూములను శుభ్రం చేయించకపోతే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతినే పరిస్థితి ఉంటుందన్నారు. బీటీ రోడ్ల నిర్మాణంలో హైషోల్డర్ పద్ధతి పాటించడం వల్ల రోడ్లు పాడవుతాయన్నారు. మధ్యలో పల్లం ఉండడంతో వర్షం నీరంతా అక్కడే ప్రవహించడంతో అవి తొందరగా పాడైపోతున్నాయన్నారు. దీనిపై జాగ్రత్త పడాలన్నారు.
జిల్లాలో 70వేల కిలోమీటర్ల పొడవున్న రోడ్లుంటే, 50 వేల కిలోమీటర్లరోడ్ల నిర్వహణకే నిధులు మంజూరవుతున్నాయన్నారు. తక్కిన రోడ్ల నిర్వహణను పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణకు సైట్ ఇంజనీర్‌ను సంబంధిత కాంట్రాక్టరే నియమించుకోవాలన్నారు. ఒకవేళ కాంట్రాక్టరు ఏర్పాటు చేసుకోకపోతే మీరే ఏర్పాటు చేసి అతని జీతాన్ని పనికి చెల్లించే బిల్లులో కట్ చేయాలన్నారు. పనుల అంచనాల్లోనే క్వాలిటీ కంట్రోల్‌కు ప్రొవిజన్ కల్పించాలని కోరారు. సమీక్షలో పంచాయతీరాజ్ ఈఈలు, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
మరిన్ని నిధులు మంజూరు చేయండి
జిల్లాలో రోడ్ల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మం జూరు చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నం దున ఆ రాష్ట్రాలతో సమానంగా ఇక్కడ కూడా రోడ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఈని కోరారు. అలాగే కేంద్రం నుంచి పీఎంజీఎస్‌వై, నాబార్డు పథకాల ద్వారా అదనపు నిధులకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.
సెప్టెంబర్ 1 తర్వాత మంజూరైన పనులను ఆపేయండి
2013 సెప్టెంబర్ ఒకటి తర్వాత మంజూరైన పనులన్నింటినీ ఆపేయాలని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రామ్మూర్తి ఆ శాఖ ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. నిధుల కొరత కారణంగా సెప్టెంబర్ నుంచి చేపట్టిన పనులను నిలిపేయాలని ప్రభుత్వం కోరినట్టు తెలిపారు. అయితే దానికి ముందు చేపట్టిన అన్ని పనులను పూర్తిచేయించి వాటికి సంబంధించిన బిల్లులను డీఏవో కార్యాలయాలకు పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే వాటికి బిల్లులిస్తారు, లేదా పెండింగ్ పెట్టుకుంటారు, దాంతో మనకు పనిలేదన్నారు. అయితే మనపై నెపం లేకుండా మనపని మనం చేసుకుపోదామని కోరారు. గత ఏడాది పంచాయతీరాజ్‌కు రూ.125 కోట్లిచ్చి ఇంచుమించు రూ.900 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతిస్తే వాటిని ఎలా పూర్తి చేయాలో మీరే ఆలోచించండి అని అన్నారు.
మన పరిధిలోని రోడ్ల నిర్వహణకు ఒక ఏడాదికి రూ.1,500 కోట్లు అవసరం కాగా కేవలం ఆరేడు వందల కోట్ల బడ్జెట్ మాత్రమే విడుదల చేస్తుండడంతో నిర్వహణ సాధ్యం కావడం లేదన్నారు. ఈ ఏడాదికి రూ.268 కోట్ల బడ్జెట్ అవసరమని ప్రతిపాదనలు పంపగా రూ.64 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని, ఇది చాలదని అడిగితే ఇతర శాఖలకు కేటాయించిన బడ్జెట్ ఖర్చు కాకపోతే దాన్ని మళ్లిస్తామని చెబుతోందని పేర్కొన్నారు. విశాఖ జిల్లా పాడేరు ప్రాజెక్టు పనిలో డీఈఈలు అవసరం ఉన్నందున ఇక్కడున్న వారెవరైనా పనిచేసేందుకు ముందుకొస్తే అక్కడకు పంపుతామన్నారు. ఆరు నెలలు మాత్రమే అక్కడ పనిచేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత యథాస్థానానికి వచ్చేయవచ్చని ఆయన తెలిపారు.