
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనుల్లో కాంక్రీట్ పనులకు 60సీ నిబంధన కింద ప్రస్తుత కాంట్రాక్టర్ నుంచి తప్పించి, ఆ పనులకు ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం వాస్తవ ధర ఎంత అవుతుందో లెక్కించి.. అదే ధరకు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. ఒప్పందం ప్రకారం కొన్ని పనులను తొలగించి, వాటికి మళ్లీ టెండర్లు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ దానివల్ల అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుత కాంట్రాక్టర్ న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అంచనా వ్యయం పెరిగే ఏ ప్రతిపాదననూ అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. సబ్ కాంట్రాక్టర్లకు ప్రధాన కాంట్రాక్టర్(ట్రాన్స్‌ట్రాయ్) ద్వారా కాకుండా నేరుగా బిల్లులు చెల్లించేందుకు పీపీఏ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో ‘ఎస్క్రో’ అకౌంట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2013 భూసేకరణ చట్టం ఆధారంగా భూసేకరణ, çపునరావాస ప్యాకేజీ నిధులను విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రతిపాదనను తోసిపుచ్చారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించాలని సూచించారు.
జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్ మసూద్ హుస్సేన్ కమిటీ నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పనులపై బుధవారం రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులతో గడ్కరీ సమీక్ష జరిపారు. కాగా కాంట్రాక్టు ఒప్పందం కంటే తాము అధికంగా పనులు చేస్తున్నామని.. ఆ మేరకు అదనపు బిల్లులు చెల్లించాలని ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ ప్రతినిధి చేసిన ప్రతిపాదనను గడ్కరీ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment