సాక్షి, కరీంనగర్ : పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరు అంశం కొత్త మలుపు తిరిగింది. గైర్హాజరు ఉపాధ్యాయులపై చర్యల ప్రక్రియ మొత్తం టీచర్లకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. నిర్ధిష్టమైన కారణాలుంటే మినహాయింపు ఇస్తామన్న అధికారులు ఇప్పుడు వారు ఇచ్చిన వివరణలను పరిశీలించకుండానే చర్యలకు సిద్ధం కావడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగుల వేతనాల్లోంచి రెండు రోజుల జీతాన్ని కోత పెట్టాలని కలెక్టర్ జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల ఉపాధ్యాయులకు జీతాలు అందుతాయా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. జిల్లాలో 1,220 మంది ఎన్నికల విధులకు గైర్హాజరైనట్లు తేల్చారు. వీరిలో 1100 మంది ఉపాధ్యాయులు. ఇందులోనూ చాలా మంది ఎన్నికల విధులు నిర్వర్తించినా, పై అధికారుల అలసత్వంతో గైర్హాజరైనట్లు నోటీసులు అందుకున్నారు.
ఒకరికే రెండు చోట్ల డ్యూటీలు వేయడం వల్ల ఒక చోట పని చేసినా మరో చోట గైర్హాజరైనట్టు నమోదైంది. రెండు చోట్ల డ్యూటీలు పడ్డ వారితోపాటు సరైన కారణాలతో హాజరుకాలేని వారికి చర్యల నుంచి మినహాయింపు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని నోటీసులు కూడా పంపించారు. ఈ నోటీసులకు చాలా మంది వివరణ కూడా పంపారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా అందరి వేతనాల్లో కోత విధించేందుకు ఆదేశాలు ఇవ్వడంతో షాకైన ఉపాధ్యాయ సంఘాల నేతలు శుక్రవారం జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయంలో సమావేశమయ్యారు. తాజా నిర్ణయం వల్ల 14,500 మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన వారు పాఠశాలలో ఒక్కరు ఉన్నా మిగిలిన ఉపాధ్యాయుల బిల్లులు కూడా పంపించేందుకు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు అంగీకరించడం లేదు. వచ్చే నెల వేతనం వచ్చేందుకు వీలుగా ఆయా పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఈ నెల 25 లోపు బిల్లులు ట్రెజరీలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 25 ఆదివారం కావడం వల్ల 24న ఈ పని పూర్తి చేయాలి. కానీ, శనివారం వరకు బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపే అవకాశం కనిపించడం లేదు. సమయానికి బిల్లులు ట్రెజరీకి చేరకపోతే వేతనం అందడం కష్టమే. గైర్హాజరును మొదటి తప్పుగా భావించి మన్నించాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కలెక్టర్‌ను కలిసి విన్నవించాయి. అయినా తమ విన్నపాన్ని మన్నించకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వివరణలు పట్టించుకోకుండా కేసులు నమోదు చేయడం కూడా వారిని ఆవేదనకు గురిచేస్తోంది. విధులు నిర్వర్తించినా... తప్పుగా పేర్కొన్న ఎంపీడీవోలపైనా, రెండు డ్యూటీలు వేసిన వారి మీద చర్యలు లేకుండా కిందిస్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్ వెళ్లి మంత్రి శ్రీధర్‌బాబును కలవాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి.
వేతనాలు హుళక్కే!
Published Sat, Aug 24 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement