సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యవాదిగా ముద్ర వేయించుకునేందుకు చివరి బాల్‌ను అడ్డం పెట్టుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు బ్యాట్ పడేయడం తెలిసిందే. పైలీన్ తుపాన్‌ను ఆపలేనేమో కానీ.. విభజనను ఆపి తీరతానని ప్రగల్భాలు పలికారు.
మాటలు కోటలు దాటించిన ఆయన.. చేతల్లో ఏమీ చేయలేకపోయారు. అయితే అధిష్టానం చేతిలో కీలుబొమ్మగా.. విభజనకు ఆయనే మార్గం సుగమమం చేశారనే విషయం చివరి దాకా బయటపడకుండా జాగ్రత్త పడగలిగారు. అంతా అయిపోయాక.. తెలుగు ప్రజలను నిలువునా చీల్చాక అధిష్టానం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ఆయన కొత్త పార్టీ పేరిట సరికొత్త ఆటకు తెరతీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. వర్గాన్ని కూడగట్టుకునే దిశగా ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా నాయకులతో సంప్రతింపులు జరుపుతుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీరిలో చాలా మంది ఆయన వెంట నడిచేందుకు నిర్మొహమాటంగా ససేమిరా అన్నట్లు సమాచారం.
ఇందుకు కారణం ప్రజల్లో ఆయన కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకోవడమే. కిరణ్ రాజీనామా చేసిన రోజు మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఆయన వెంటే ఉన్నారు. వీరు కూడా తమ పదవులకు రాజీనామా చేసినట్టు ఆ సందర్భంగా ప్రకటించారు. అలాంటి వీరు కూడా కిరణ్ పార్టీలో చేరేందుకు వెనకడుగు వేస్తుండటం తక్కిన వారిని ఆలోచనలో పడేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శిల్పా మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నిరజారెడ్డి, మురళీకృష్ణ ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.
తటస్థులపై కన్ను
జిల్లాలోని ఆయా పార్టీల్లో టిక్కెట్ ఆశించి భంగపడిన నాయకులు, తటస్థులపై ప్రధానంగా కిరణ్ దృష్టి సారించినట్లు చర్చ జరుగుతోంది. వీరందరితో ఫోన్‌లో రహస్య మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు, శ్రీశైలం, నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, ఆదోని తదితర నియోజకవర్గాల నాయకులతో ఆయన మాట్లాడినట్లు సమాచారం. అత్యంత సన్నిహితులతో ఫోన్ చేయించి.. ఆ తర్వాత ఆయనే వారితో మాట్లాడుతున్నట్లు ఓ నాయకుడు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను కొత్త పార్టీ వైపు ఆకర్షితులను చేసే బాధ్యత మంత్రి పదవికి రాజీనామా చేసిన ఓ నాయకునికి అప్పగించినట్లు తెలిసింది.
ఆటపోట్లు
Published Sun, Feb 23 2014 3:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement