కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండుతో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు ఎన్జీఓలు చేపట్టిన సమ్మె శుక్రవారానికి రెండవరోజుకు చేరుకుంది. ఇటీవల జరిగిన ఉద్యమంలో ఉద్యోగులందరూ పాల్గొన్నారు. దీనిపై అడ్డంకులు ఇంకా తొలగకపోవడం, సర్వీసుకు సంబంధించిన వ్వవహారాలు ఉండడంతో ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఉద్యమంలోకి రానట్లు తెలుస్తోంది.
రాయచోటి పట్టణంలో ఎన్జీఓ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. డైట్‌లో జరిగే అవగాహన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర సమాచార హక్కు చట్టం శాఖ కన్వీనర్ ఇంతియాజ్ అహ్మద్‌ను ఆందోళనకారులు అడ్డగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులకు, ఉద్యోగులకు కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఉద్యోగులను స్టేషన్‌కు తరలించారు.
కడపలో ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి సమ్మెను పర్యవేక్షించారు. కలెక్టరేట్, పౌరసరఫరాలు, ట్రెజరీ, సర్వే, చీఫ్ ప్లానింగ్ కార్యాలయాకు వెళ్లి ఉద్యోగులను బయటికి పంపివేశారు. సమ్మెకు సహకరించి సమైక్యాంధ్రకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్జీఓ నేతలు శ్రీనివాసులు, అలీఖాన్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
పులివెందులలో తహశీల్దార్ కార్యాలయంతోపాటు పలు ఆఫీసులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రొద్దుటూరుపట్టణంలో ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి సమ్మెను పర్యవేక్షించారు. ఆర్‌అండ్‌బీ, ట్రెజరీతో పాటు మరికొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి.
రైల్వేకోడూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ చైర్మన్ పి.ఓబులేసు ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్వర్‌బాష, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు రంగారెడ్డి, సుదర్శన్‌రాజు, కాంగ్రెస్ నాయకులు జయప్రకాశ్, ఆదర్శ హైస్కూలు విద్యార్థులు సంఘీభావం తెలిపారు.
బద్వేలు తహశీల్దార్ కార్యాలయం మూతపడింది. మిగతా కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి.
జమ్మలమడుగులో ఎన్జీఓ అధ్యక్షుడు నారాయణరెడ్డి సమ్మెను పర్యవేక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.
కమలాపురంలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే మూతపడ్డాయి. మిగతా కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి.
రాజంపేటలో ఎన్జీఓ అసోసియేషన్ చైర్మన్ రమణ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు యోహాన, రామచంద్రయ్య, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరులో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది విధులను బహిష్కరించారు.మిగతా కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి.
రెండో రోజూ పాక్షికమే
Published Sat, Feb 8 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement