‘థర్మల్’పై పోరుకు సన్నాహాలు
ప్రజలను చైతన్య పరుస్తున్న ఐక్యవేదిక నాయకులు
సోంపేట/కవిటి: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరప్రాంతంలో నిర్మించదలచిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాటకు ఐక్యవేదిక నేతలు సన్నద్ధమవుతున్నారు. పర్యావరణ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు ఉద్యమబాట పట్టేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి తీర ప్రాంత గ్రామాలైన బారువ, బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, లక్కవరం, గొల్లగండి, రుషికుద్ద, ఇస్కలపాలెం, గొల్లగండి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కవిటి మండలంలోని పలు గ్రామాల్లో వేదిక సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వై.కృష్ణమూర్తి, బీన ఢిల్లీరావు, తమ్మినేని రామారావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బారువ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అరుదైన, శ్రేష్టమైన చిత్తడి నేలలను కాపాడుకునేందుకు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్మల్ పవర్‌ప్లాంట్ స్థాపనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని మత్స్యకార ఐక్యవేదిక సంఘం అధ్యక్షుడు రాజారావు, ఉపాధ్యక్షుడు సోమయ్య, మాజీ అధ్యక్షుడు వాసుపలి కృష్ణారావు కవిటి మండలంలో పర్యటిస్తూ స్పష్టం చేశారు.
చిత్తడి నేలల్లో ఇండస్ట్రియల్ పార్క్
మరోవైపు సోంపేట బీల ప్రాంతంలోని చిత్తడి నేలల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ది చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనకు వెళ్లే ముందే ఇండస్ట్రియల్ పార్క్‌కు భూసేకరణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.