thermal powerplant
-
కొత్త థర్మల్ ప్లాంట్లపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంగా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర అవసరాలుపోగా విద్యుత్ మిగులు కూడా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని విరమించుకోవాలనే భావనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. సింగరేణి సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మించింది. విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి 2019 డిసెంబర్ 18న కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇంకా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. తెలంగాణలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో తొలిదశ కింద 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను రామగుండంలో చేపట్టారు. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్ కట్టాల్సి ఉంది. ఎన్టీపీసీ దీనికి పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటివరకు దరఖాస్తే చేసుకోలేదు. రెండోదశ ప్లాంట్‌కు సంబంధించి ఇంతవరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు లేవని ఎన్టీపీసీ అధికారవర్గాలు తెలిపాయి. 800 మెగావాట్ల సింగరేణి, 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు కనిపిస్తున్నా.. కొద్దిరోజులుగా విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులోనూ వాటిని చేపట్టే అవకాశాలు తక్కువని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భారీగా అందుబాటులోకి.. ప్రస్తుతం రాష్ట్రంలో.. 3,772.5 మెగావాట్ల తెలంగాణ జెన్కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,645 మెగావాట్ల కేంద్ర ప్లాంట్లు, 839 మెగావాట్ల సెమ్‌కాబ్ (ప్రైవేటు) కలిపి మొత్తం 8,456 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న 270 మెగావాట్ల భద్రాద్రి, 4 వేల మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర థర్మల్ విద్యుత్ సరఫరా సామర్థ్యం 14,326.5 మెగావాట్లకు పెరుగుతుంది. దీనికి అదనంగా 2,531.76 మెగావాట్ల జెన్కో జలవిద్యుత్ కేంద్రాలు, 3,472 మెగావాట్ల సౌర, 128 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా థర్మల్, హైడల్, సోలార్, విండ్ ప్లాంట్లు అన్నీ కలిపి దాదాపు 25 వేల మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరనుంది. పెట్టుబడి గిట్టుబాటు కాదు.. కాళేశ్వరం, పాలమూరు వంటి కొత్త ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్రంలో 8వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. 2022–23 నాటికి పూర్తికానున్న యాదాద్రి, ఎన్టీపీసీ ప్లాంట్లతో ఈ డిమాండ్ తీరిపోయి, ఇంకా మిగులు విద్యుత్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఆశించిన మేర విద్యుత్ డిమాండ్ పెరగకపోతే.. కొత్త థర్మల్ ప్లాంట్లపై పెట్టే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. అందువల్ల కొత్త థర్మల్ ప్లాంట్లు చేపట్టకపోవడమే మేలు అని చెప్తున్నారు. -
విదేశీ కంపెనీలకు భూముల ధారాదత్తం
పోలాకి:మండలంలోని థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాల్లో సీపీఐ నాయకులు ఆదివారం పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ అధ్యక్షతన తోటాడ, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, చీడివలస గ్రామాల్లో పర్యటించి థర్మల్ పవర్‌ప్లాంట్‌పై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సన్యాసిరాజుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో విల్సన్ మాట్లాడుతూ విదేశీ కంపెనీల మోజులో రైతుల హక్కులకు భంగం కలిగే నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారన్నారు. రాజధానితో పాటు వివిధ పరిశ్రమల నిర్మాణంలో ప్రభుత్వ, రైతుల భూములు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. పోలాకి థర్మల్ పవర్‌ప్లాంట్‌పై రహస్య సర్వేలు చేస్తున్నట్టు వ స్తున్న వార్తలపై కలెక్టర్ గాని, జిల్లాకు చెందిన మంత్రి గాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాపర సుందరలాల్ మాట్లాడుతూ పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కూలీ సంఘం నాయకులు లండ వెంకటరావు, గేదెల చిరంజీవులు, బి.త్రినాథరావు పాల్గొన్నారు. -
వాతావరణ మార్పులపై బృహత్ ప్రణాళిక
ఆవిష్కరించిన అధ్యక్షుడు ఒబామా వాషింగ్టన్: అమెరికా థర్మల్ పవర్ప్లాంట్ల ద్వారా వాతావరణంలో కలుస్తున్న గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించే ఒక భారీ ప్రణాళికను అధ్యక్షుడు ఒబామా సోమవారం ఆవిష్కరించారు. మానవాళి భవిష్యత్‌కు వాతావరణంలో వచ్చే మార్పులే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. 2030 నాటికి దేశంలోని విద్యుత్ ప్లాంట్ల కర్బన కాలుష్యం 32 శాతం వరకూ తగ్గుతుందన్నారు. ఉద్గారాల తగ్గింపుపై అమెరికా ముందడుగు వేస్తేనే ఇతర దేశాలూ అనుసరిస్తాయని, తమ దేశాన్ని చూసే చైనా కూడా చర్యలు ప్రారంభించిందని ఒబామా పేర్కొన్నారు. అంతకుముందు ఉద్గారాల తగ్గింపుపై భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు తీసుకుంటున్న చర్యలను వైట్ హౌస్ ఉదహరించింది. -
‘థర్మల్’పై పోరుకు సన్నాహాలు
ప్రజలను చైతన్య పరుస్తున్న ఐక్యవేదిక నాయకులు సోంపేట/కవిటి: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ తీరప్రాంతంలో నిర్మించదలచిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాటకు ఐక్యవేదిక నేతలు సన్నద్ధమవుతున్నారు. పర్యావరణ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు ఉద్యమబాట పట్టేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి తీర ప్రాంత గ్రామాలైన బారువ, బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, లక్కవరం, గొల్లగండి, రుషికుద్ద, ఇస్కలపాలెం, గొల్లగండి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కవిటి మండలంలోని పలు గ్రామాల్లో వేదిక సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వై.కృష్ణమూర్తి, బీన ఢిల్లీరావు, తమ్మినేని రామారావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బారువ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అరుదైన, శ్రేష్టమైన చిత్తడి నేలలను కాపాడుకునేందుకు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. థర్మల్ పవర్‌ప్లాంట్ స్థాపనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని మత్స్యకార ఐక్యవేదిక సంఘం అధ్యక్షుడు రాజారావు, ఉపాధ్యక్షుడు సోమయ్య, మాజీ అధ్యక్షుడు వాసుపలి కృష్ణారావు కవిటి మండలంలో పర్యటిస్తూ స్పష్టం చేశారు. చిత్తడి నేలల్లో ఇండస్ట్రియల్ పార్క్ మరోవైపు సోంపేట బీల ప్రాంతంలోని చిత్తడి నేలల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ది చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటనకు వెళ్లే ముందే ఇండస్ట్రియల్ పార్క్‌కు భూసేకరణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.