సాక్షి, నెల్లూరు : నిన్న ఉపాధ్యాయుడు శంకర్‌యాదవ్, నేడు ఆర్టీసీ ఉద్యోగి సోమశేఖర్‌రాజు.. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊపిరి పోసేందుకు తమ ఊపిరి వదిలారు. సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమంటూ అమరులయ్యారు. ఉద్యమకారుల ప్రాణ త్యాగాలతో సింహపురిలో సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. సింహపురి వాసులు సాగిస్తున్న ఉద్యమం జిల్లాలో 57వ రోజు బుధవారం మరింత ఉధృతంగా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న నిరవధిక దీక్షలో ఉద్వేగానికి గురై స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్‌రాజు బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని ఏజేసీ పెంచలరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం రవికుమార్ సందర్శించి నివాళులు అర్పించారు.
కార్మికులు ఆయన భౌతిక కాయంతో ఊరేగింపు నిర్వహించారు. నగరంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. శ్రీపొట్టి శ్రీరాములు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నుంచి మూ డు రోజులు వీఆర్‌సీ సెంటర్‌లో తల్లుల రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. నెల్లూరు వేదాయపాళెం సెం టర్‌లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. నర్తకీ సెం టర్‌లో వాణిజ్య ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్‌లో జరుగుతున్న రిలే దీక్షల్లో బుధవారం ప్రైవేటు పాఠశాలల బస్సు డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
టవర్‌క్లాక్ సెంటర్ వద్ద విద్యార్థి జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. వాకాడులోని ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. చిట్టమూరులో ఎంఈఓ ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలో ఈ నెల జరగబోవు సమైక్య గర్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని చైతన్య రథాన్ని ప్రారంభించారు.వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో బుధవారం అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయగిరి నియోజక వర్గంలోని వింజమూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 54వ రోజుకు చేరాయి. సరస్వతి పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. కలిగిరి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి గ్రామచైతన్య యాత్రను ప్రారంభించారు. కొండాపురం మండలం సాయిపేటలో గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి.
సమైక్యాంధ్రకు మద్దతుగా పొదలకూరులో కొయ్య మిల్లులు, తోపుడు మిల్లులు, మోటార్ రీవైండింగ్, చిన్న పరిశ్రమల కార్మికులు, యజమానుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సూళ్లూరుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం గ్రామ సేవకులు, వీఆర్‌ఏలు దీక్షలో పాల్గొన్నారు. అక్టోబర్ ఒకటిన నిర్వహించనున్న ‘పులికాట్ పొలికేక’కు సంబంధించి కరపత్రాన్ని జేఏసీ నాయకులు విడుదల చేశారు. మహిళా టీచర్లు ఉండమ్మా బొట్టుపెడతా కార్యక్రమంలో భాగంగా ఈ కరపత్రాలను పట్టణంలోని ఇంటింటికి వెళ్లి సమైక్య ఉద్యమంలోకి రావాలని కోరారు.
నాయుడుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సమైక్య గ్రామీణ బస్సు యాత్రను ప్రారంభించారు. గ్రామీణులకు సమైక్య ఉద్యమం గురించి అవగాహన కల్పించేందుకు ఈ బస్సుయాత్రను చేపట్టారు. మండలంలోని ద్వారకాపురం, మేనకూరు, అరవపెరిమిడి, పుదూరు, పూడేరు, గొట్టిప్రోలు గ్రామాల్లో పర్యటించారు. కావలిలో సుమారు 500 మందితో సామూహిక రిలేదీక్షను స్థానిక శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్లో గురువారం నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ తిరివీధి ప్రసాద్ తెలిపారు. పట్టణంలో వైఎస్సార్‌సీపీ, సమైక్యాంధ్ర జేఏసీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యాన రిలేనిరాహారదీక్షలు కొనసాగాయి.
కావలిరూరల్ మండలంలో ఎస్టీయూ ఆధ్వర్యంలో జనచైతన్యయాత్రలను నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో యువకులు దీక్షకు దిగారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో పెయింటర్స్ సంఘం కార్మికులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ జేఏసీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక ఎస్‌ఆర్‌జే డిగ్రీ కళాశాల అధ్యాపకులు లక్ష్మణరావుపల్లి నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
త్యాగధనుల గడ్డ
Published Thu, Sep 26 2013 3:54 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement