సమైక్య రాష్ట్ర పరిరక్షణ...జగన్‌కే సాధ్యం
=పామర్రులో వైఎస్సార్‌సీపీ ధర్నా
= దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మ దహనం
సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పామర్రులో శనివారం ఉధృతంగా ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్, టీడీపీల తీరును దుయ్యబట్టారు. ఇప్పటికైనా సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి కలసి రావాలని విజ్ఞప్తి చేశారు.
పామర్రు, న్యూస్‌లైన్ : సమైక్య రాష్ట్ర పరిరక్షణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన తెలిపారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం పామర్రులో భారీ ర్యాలీ నిర్వహించారు. దిగ్గీ రాజా డౌన్ డౌన్.. సోనియా, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అనంతరం స్థానిక నాలుగురోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారు. కల్పన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని అన్ని రాష్ట్రాలూ తిరుగుతూ, ఆయా నాయకులకు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విభజన ప్రక్రియను వివరిస్తూ వారి మద్దతు కూడగడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజన కోసం ఎన్నో కుళ్లు రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు కళ్లు తెరిచి విభజన కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని అనడం దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందాన ఉందన్నారు. ఇప్పటికైనా రెండు పార్టీల ఎమ్మెల్యేలు పార్టీలను పక్కనబెట్టి సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో ప్రతిఘటించాలని కోరారు. గత ఆరు నెలల నుంచి సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా మిగిలిన పార్టీలవారు మిన్నకుండటం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందన్నారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ టీ బిల్లును తెచ్చి దాని ఆమోదం కోసం నేతలపై ఒత్తిడి తెస్తుండటాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను నేతలు దహనం చేశారు.
రెండు ప్రాంతాలనూ మోసగిస్తున్న చంద్రబాబు...
పార్టీ పెనమలూరు సమన్వయకర్త పడమట సురేష్‌బాబు మాట్లాడుతూ ఊసరవెల్లి కన్నా ఎక్కువసార్లు రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇటు తెలంగాణాలోనూ, సీమాంధ్ర ప్రాంతంలోనూ మద్దతు పలుకుతున్నట్లు నటిస్తూ రెండు ప్రాంతాల ప్రజలనూ మోసం చేస్తున్నారన్నారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ మాట్లాడుతూ నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను హెచ్చరించారు. సమైక్యం కోసం జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం చేస్తున్న ఉద్యమాలను చూసి ఓర్వలేక, ప్రజలలో వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక ఆయనపై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.
తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి సమైక్యవాదులు, మహిళల నుంచి ఎంతో స్పందన వస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామర్రు సర్పంచ్, ఉప సర్పంచ్‌లు దేవర కొండ రోహిణి, ఆరేపల్లి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, బొబ్బా సురేష్, గంటా దేవదానం, ముత్తేవి ప్రసాద్, కిలారపు శ్రీనివాసరావు, సుబ్బయ్యదాసు, యజ్ఞనారాయణ, చాట్ల పున్నమ్మ తదితరులతో పాటు 200 మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు.