విజయవాడ కల్చరల్ ప్రపంచానికి భారతదేశం విశ్వగురువని ఆకాశవాణి హైదరాబాద్ సంచాలకులు వి.ఉదయశంకర్ అన్నారు. కామకోటి నగర్‌లోని శ్రవణ సదనంలో శృతిలయ నివాస్ శనివారం నిర్వహించిన త్యాగ రాజస్వామి ఆరాధనోత్సవాలు, నగర సంకీర్తనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం సంగీత, సాహిత్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. గురువును మించిన దైవం లేదని, గురువును సేవించడం ద్వారా విద్యార్థికి చదువుకు తగిన సార్థకత చేకూరుతుందని తెలిపారు. చదువులతోపాటు మనిషి మేధస్సును పెంచే ఇతర లలిత కళలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. విష్ణు భొట్ల శ్రీరామమమూర్తి కుటుంబసభ్యులు కామ కోటినగర్‌లోని ఉత్సవాల వేదిక వద్దనుంచి పలువీధుల్లో స్వామివారి విగ్రహాలతో త్యాగరాజస్వామి కీర్తలను ఆలపిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం విష్ణుభొట్లసోదరీ మణుల శిష్యబృందం ఉమాసాహితీ, లాస్యప్రియ, రుషిజ్ఞ, కృష్ణస్నేహ, రాజ్యలక్ష్మి లహరి పలు సంప్రదాయ కీర్తనలను ఆలపించారు. చివరిగా హైదరాబాద్ ఆకాశవాణి సంచాలకులు ఉదయశంకర్ పలు సంప్రదాయ కీర్తనలను ఆలపించారు. విష్ణు భొట్ల కృష్ణవేణి, బి.వి.ఎస్.ప్రసాద్ సహకరించారు.
భక్తి శ్రద్ధలతో త్యాగరాజ స్వామి నగర సంకీర్తన
విజయవాడ కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత సన్మండలి సంయుక్త నిర్వహణలో సంగీత కళాశాలలో శనివారం నిర్వహించిన నగర సంకీర్తనా, ఊంఛవృత్తి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. నాదోపాసకుడు, త్యాగబ్రహ్మ త్యాగరాజస్వామిని పల్లకీలో ఆవాహన చేసి సంగీత కళాకారులు నగరంలోని పలు ప్రాంతాల్లో గానం చేస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. సన్మండలి కార్యదర్శి మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, సంగీత కళాకారుడు పోకూరి గౌరీనాధ్, గాయత్రీ గౌరీనాధ్, చారుమతి పల్లవి, సన్మండలి అధ్యక్షుడు పెమ్మరాజు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మల్లాది అరవింద్ కార్తీక్, శివానంద యశస్వి సంప్రదాయ కీర్తనతో సంగీత కార్యర్రమాలు ప్రారంభమయ్యాయి. మృదంగంపై శివానంద యశస్వి, వయోలిన్‌పై బి.వి.దుర్గాభవానీ సహకరించారు. ఓరుగంటి వనజ, బి.వి .వెష్ణవి, వాగ్దేవి గాత్రయుగళం ఆకట్టుకుంది.
ఆకాశవాణి హైదరాబాద్
సంచాలకులు వి.ఉదయశంకర్
విశ్వగురువు భారత్
Published Sun, Jan 11 2015 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement
Advertisement