ఆసరాలేని బతుకులు
వేలాది మంది అర్హుల పింఛన్లు రద్దు
పెండింగ్‌లో మరో 28వేల దరఖాస్తులు
కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం
నేటికీ పంపిణీకాని అక్టోబర్ నెల పింఛన్
జీవన పోరాటంలో అలసిపోయిన వారు..జవసత్వాలు ఉడిగి జీవిత చరమాంకంలో ఉన్నవారు..విధి వంచనకు గురైన వారు, వితంతువులు.. వీరందరికీ పెద్ద కష్టమొచ్చిపడింది. ఇన్నాళ్లూ వచ్చే పింఛన్ తక్కువే అయినా నెల నెలా క్రమం తప్పకుండా చేతికందేది. అక్టోబర్ 2 నుంచి ఈ మొత్తాన్ని పెంచి నప్పటికీ నిబంధనల మాటున అర్హుల పేర్లను తొలగించడంతో జిల్లాలో వేలాది మంది పింఛన్లకు నోచుకోలేదు. వేలి ముద్రలు పడలేదని, ఆధార్ కార్డులేదని, బతికే ఉన్నట్లు రుజువేమిటంటూ కుంటి సాకులతో ఎగవేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్న వాదన వ్యక్తమవుతోంది.
నా పింఛను రద్దయింది
నాది కశింకోటలోని భవాని కాలనీ. నాకు 65 శాతం అంగ వైకల్యం ఉంది. ఎక్కడికైనా వెళ్లాలంటే నడవలేని పరిస్థితి. వికలాంగుల రిక్షాయే ఆధారం. ఏ కారణంగానో నా పింఛను తొల గించారు. ఇటీవల మళ్లీ ఎంపీడీవో, జన్మభూమి కమిటీకి నివేదించుకున్నారు.
-సూరిశెట్టి రాంబాబు
విశాఖపట్నం: అధికారంలోకి రాగానే రూ.200 ఉన్న పింఛన్‌ను పెంచి వృద్ధులకు రూ.1000లు, వికలాంగులకు రూ.1500 ఇస్తామని టీడీపీ మాటిచ్చింది. అధికారం చేపట్టాక ఆ మాట నిలుపుకుంటున్నామంటూ ‘ఆసరా’ పేరుతో గాంధీ జయంతి నాటి నుంచి పెంచిన పింఛన్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంది. వాటి పంపిణీకి జన్మభూమి సభలను వేదికగా చేసుకుంది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. హుద్‌హుద్ తుఫాన్‌తో జన్మభూమి సభలు అర్ధంతరంగా ఆగిపోయాయి. దాంతో పాటే పింఛన్ల పంపిణీకి బ్రేక్‌పడింది. దీంతో నవంబర్ 5వ తేదీలేగా ఇవ్వాల్సిన అక్టోబర్ నెల పింఛన్‌కు ఇప్పటికీ వేలాది మంది నోచుకోలేదు. అప్పుడే నెల గడిచిపోయింది. నవంబర్ నెల పింఛన్ ఈమే 5లోగా చెల్లించాలి. ఇప్పుడు అదీ జరిగేలా కనిపించడం లేదు. కాగా పింఛన్ మొత్తాన్ని పెంచుతున్నామంటూ నింబంధనలంటూ వేలాది మంది అర్హులకు పింఛన్ లేకుండా చేశారు. జిల్లా వ్యాప్తంగా 30,179 పింఛన్లు సామాజిక తనిఖీ పేరుతో తొలగించారు.
వాటిలో దాదాపు 10వేలు జీవీఎంసీ పరిధిలోనివి, తొలగింపుల్లో 65శాతం వృద్ధులవే కావడం గమనార్హం. వారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇక కొత్తగా 28వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో 25వేల మందిని అర్హులుగా గుర్తించారు. నివేదికను ప్రభుత్వానికి పంపారు. వలసపోయారని, ఆధార్ లేదని మిగతా 3వేల మందిని అనర్హులుగా పేర్కొన్నారు. ఇప్పటికే 30వేలకు పైగా పింఛన్లు రద్దు చేయగా ఈ మూడు వేలు అదనం. ఇలా ఏదో సాకు చూపి అర్హుల పింఛన్లు తొలగిస్తూ, కొత్తవి ఇవ్వకుండా ప్రభుత్వం పేదల బతుకులకు ‘ఆసరా’లేకుండా చేస్తోంది.