కళాశాలలో పడి ఉన్న మద్యం బాటిళ్లు
నిత్యం పాఠాలు మంత్రాల్లా వినిపించే అపురూపమైన చోటు అపవిత్రమవుతోంది. మహాయాగంలా బోధనలు సాగే స్థలం సిగ్గుతో తల దించుకుంటోంది. సభ్యసమాజాన్ని నిర్మించే కళాశాల ‘కొందరు’ చేసిన పని చూడలేక కన్నీళ్లు పెట్టుకుంటోంది. మందసలోని జూనియర్ కాలేజీలో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉదయం తలుపులు తెరిచిన వెంటనే దీనికి రుజువులు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా జరుగుతున్న ఈ తంతుపై అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందస:తరగతి గదిలో నలిగిపోయిన మల్లెపువ్వులు, వాడంబరాలు. మరో గదిలోకి వెళ్తే కంపు కొట్టే ఆహార పొట్లాలు, ఆ పక్కనే పడి ఉండే ఖాళీ మద్యం సీసాలు. గది బయటకు వస్తే విరిగిపోయి కనిపించే పైప్‌లైన్లు. సాయంత్రం అన్నీ శుభ్రం చేసి వెళ్తే పొద్దున్న వచ్చే సరికి మళ్లీ అవే దృశ్యాలు. మందస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోజుల తరబడి సాగుతున్న దుశ్చర్యలివి. కళాశాల గది అనే స్పృహ లేకుండా ఆకతాయిలు చేస్తున్న ఆగడాలు విద్యార్థులు, అధ్యాపకులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తాళం వేసి ఉన్నా వాటిని విరగ్గొట్టి మరీ గదుల్లోకి ప్రవేశిస్తున్న దుండగులు రాత్రిపూట కాలేజీని ఇలా అవసరాలకు వాడుకుంటున్నారు. తాగి పారేసిన మద్యం సీసాలను అక్కడే పగులగొట్టి వేస్తుండడంతో ఉదయం కాలేజీకి వస్తున్న విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకతాయిల పనేనా..?: కాలేజీని 1985లో ప్రారంభించారు. ప్రస్తుతం 600 మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ, ఒకేషనల్ గ్రూపుల్లో ఉన్నారు. కాలేజీ పక్కనే ప్రసిద్ధ వాసుదేవ పెరుమాళ్ ఆలయం ఉంది. అయితే ఆలయ నిర్వాహకులతో కాలేజీ వారికి ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. వాసుదేవ ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరిగాక కాలేజీని ఆలయ ట్రస్టుకు అప్పగించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. దీన్ని విద్యార్థులంతా వ్యతిరేకించారు. అప్పట్లో దీనిపై ఉద్యమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కాలేజీలో ఇలాంటి సంఘటనలు జరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
తీవ్ర ఆవేదన గురవుతున్నాం
కళాశాలలో అరాచకాలు ఎక్కువయ్యాయి. పైప్ లైన్లు ధ్వంసం చేస్తున్నారు. తలుపులు విరిచేస్తున్నారు. బాగు చేయించినా ఇదే పరిస్థితి. మల, మూత్ర విసర్జన చేస్తుండడంతో అధ్యాపకులే తీయాల్సివస్తోంది. వ్యభిచారం కూడా జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. సభ్య సమాజం తలదించుకునేలా దుండగులు వ్యవహరిస్తున్నారు. మద్యం బాటిళ్లను చెత్తా, చెదారం వేసి కాల్చుతున్నాం. పోలీసులు గట్టి నిఘా వేయాలి. – అసపాన కృష్ణారావు, ప్రిన్సిపల్, మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment