జగ్గయ్యపేట అర్బన్, న్యూస్‌లైన్ : అసమర్ధ పాలకుల చేతకాని తనం వల్ల అసలే అంతంమాత్రంగా బతుకీడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రం విడిపోతే మరిన్ని విపరీత అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సాగునీరందక, అరకొర విద్యుత్‌తో సీమాంధ్ర అన్ని విధాలుగా నష్టపోయి అంధకారమయమవుతుందని తెలిపారు. 58 రోజులుగా అమరణ నిరాహార దీక్షచేపట్టి ఆత్మబలిదానం ద్వారా సమైక్యాంధ్రను సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పోడవటం సీమాంధ్రవాసుల దౌర్భాగ్యమన్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా తెలుగు వారంతా కలసి ఉంటేనే సుఖంగా ఉంటారన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారు, ఉన్నత, సాంకేతిక విద్య నభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఉద్యోగుల ప్రమోషన్లు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల విషయంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయని, ప్రత్యేక ప్యాకేజీల ద్వారా వాటిని అభివృద్ధి చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. ఎగువ ప్రాంతంలో ప్రవహించే గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణా వారి ఆధిపత్యం కొనసాగి డెల్టా ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదముందన్నారు.
కావేరి జలాల విషయమై కర్నాటక, తమిళనాడు వివాదాల వలే నిత్యం జలపోరాటాలు తప్పవని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రవహించే మునేరుపై ఖమ్మం జిల్లా మధిర వద్ద డెప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క డ్యాం నిర్మిస్నున్నారని, దీనివల్ల పేట నియోజకవర్గంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు ప్రాంతంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందక ఎండిపోయే ప్రమాదముందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఒకే నినాదంతో సీమాంధ్ర ప్రజలంతా ఏకం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, అఖిలపక్ష, ఎన్జీవో, ఉద్యోగ సంఘాల జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యమాన్ని విరమించేదిలేదు..
జగ్గయ్యపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని విరమించేది లేదని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కూడలి వద్ద నిర్వహిస్తున్న రెండో రోజు రిలే నిరాహార దీక్షలను బుధవారం ఆయన సందర్శించి సంఘీభావం వ్యక్తం చేశారు. దీక్షలో కూర్చున్నవారిలో టూవీలర్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు జి.ముక్తేశ్వరరావు, ఉపేంద్ర, బి.రంగా, ఎండి. కలీల్ , ఎస్‌కె.హఫీజ్, సైదా,నాగులు, షమ్మీముల్లా, మున్నా తదితరులు ఉన్నారు. అఖిల పక్ష , జేఏసీ ప్రతినిధులు జే.ఉదయభాస్కర్, ఎస్‌ఎం.రఫీ, మనోహర్,రాంబాబు, న్యాయవాది రాము, జగదీష్, అబ్బాస్ ఆలీ, కన్నా నరసింహారావు, కొప్పాల శ్రీను, వెంకట్రావు, ఉషారాణి, రఘుబాబు, నారాయణరావు, శేషంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కొవ్వొత్తుల ర్యాలీ...
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పట్టణంలోని రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సమైక్యవాదులు కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాలు, ఎన్జీవో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విడిపోతే విపరీతాలే : భాను
Published Thu, Aug 22 2013 1:19 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement