
యూపీఏకు కష్టకాలమే
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రంలోని యూపీఏ-2 ప్రభుత్వ మనుగడే తల్లకిందులయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన ముఖచిత్రం కూడా మారిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆదివారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో లగడపాటి మాట్లాడారు. ‘సీమాంధ్రలో 13 మంది కాంగ్రెస్ లోక్‌సభ సభ్యులంతా రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం తీరును ధిక్కరిస్తారు.
హర్యానాలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో మరొకరు వేర్వేరు కారణాలతో పార్టీతో విభేదిస్తున్నారు. ఈ 15 మంది పోను లోక్‌సభలో యూపీఏకు మిగిలే సంఖ్యా బలం కేవలం 213 మాత్రమే’నని లగడపాటి చెప్పారు. యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న డీఎంకే, బీఎస్పీ, ఎస్పీలకు 58 మంది ఎంపీలున్నారు. డిసెంబర్ 8 ఫలితాల తర్వాత ఈ పార్టీలు యూపీఏ-2 ప్రభుత్వానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణపై సోమవారం కేంద్ర మంత్రి పల్లంరాజు ఇంట్లో జరిగే సమావేశంలో చర్చిస్తామన్నారు. జగన్, చంద్రబాబు జెండాలు పక్కన పెట్టి వస్తే వారితో కలిసి సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించడానికి తాము సిద్ధమని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.