అమ్డాపూర్ (మొయినాబాద్), న్యూస్‌లైన్: రైతులు కిసాన్ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి వ్యవసాయ సంబంధమైన సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ, డాక్టర్ ఆర్‌వీఎస్‌కే రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మోజర్లలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రూరల్ అవేర్‌నెస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా మండల పరిధిలోని అమ్డాపూర్, ఎత్‌బార్‌పల్లి, చందానగర్, మేడిపల్లి, చిలుకూరు గ్రామాల రైతులకు మూడు నెలలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం అమ్డాపూర్‌లో రైతు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు విజయ, ఆర్‌వీఎస్‌కే రెడ్డిలు మాట్లాడుతూ.. రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు సాగుచేసుకుంటే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుకోవాలన్నారు. విత్తన శుద్ధి, నారుమడులు ఏర్పాటు చేసుకోవడం, కూరగాయలు, పూల సాగు లో తీసుకోవాల్సిన మెలకువలపై వివరించారు. ఈ సందర్భంగా ఉద్యాన కళాశాల విద్యార్థులు తమ అనుభవాలను రైతులతో పంచుకున్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎం.పద్మ, హమీదున్నీసాబేగం, బీకేఎం లక్ష్మి, శిరీష, మాధవీలత, లలితాకామేశ్వరి, సర్పంచ్ సిద్దయ్య, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీశైలం, ఆదర్శరైతులు ధన్‌పాల్‌రెడ్డి, జిల్లా ఉత్తమ రైతు అవార్డు గ్రహీత పల్లె రమాదేవి, నాయకులు సత్యలింగం, రవీందర్ పాల్గొన్నారు.