రాములోరొచ్చారు...
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగం గా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి మంగళవారం వైకుంఠరాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అర్చకులు ఆరాధన గావించారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు 12 మంది ఆళ్వార్లను కొలువుతీర్చారు. వారికి వేదపండితులు 200 పాశుర పఠనం గావించారు. అంతరాలయంలో వైకుంఠ రాముడిగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం నుంచి భక్తులు జై శ్రీరామ్...జైజై శ్రీరామ్.. అంటూ జయజయధ్వానాలు చేస్తుండగా ప్రత్యేక పల్లకి లో ఊరేగింపుగా స్వామివారిని తీసుకొని వచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, కోలాటాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైకి తీసుకెళ్లారు. కొలువుదీరిన వైకుంఠ రాముని దర్శించుకొని భక్తులు పులకించారు.
జగదభి రాముడు..రఘుకుల సోముడు..
నిత్యం వైకుంఠ రాముడిగా అంతరాలయంలో భక్తులచే పూజలందుకునే జగదభిరాముడు...తన ఆశీస్సులను అందించడానికి తమ ముందుకు వచ్చే సరికి భక్తులు ఉప్పొంగిపోయారు. స్వామివారిని చూసి ‘జగదభి రాముడు శ్రీ రాముడే...రఘుకుల సోముడు ఆ రాముడే..’ అంటూ వేనోళ్ల కీర్తించారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణ యే ఉత్తమమైనదని.. అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటిచెప్పాడని, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శపురుషుడు, ధర్మ స్వరూపుడు ఆ వైకుంఠరాముడే అని ఆలయ అర్చకులు రామావతారం విశిష్టతను వివరించారు. స్వామివారికి ప్రత్యేక హారతి, నైవేద్యం సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. వైకుంఠ రాముని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు బారు లు తీరారు. స్టేడియం నుంచి రాజ వీధి మీదుగా తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎం. రఘునాథ్, ఏఈవో శ్రవణ్‌కుమార్, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, సన్యాసిశర్మ, ఆలయ అర్చకులు విజయరాఘవన్, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్‌వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
నేడు బలరాముడై..
శ్రీహరికి శయన అయిన ఆదిశేషుని అంశతో జన్మించి.. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న నానుడు కి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి.. శ్రీకృష్ణునికి అన్నగాఆయనకు ధర్మస్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. బలరామావతారంలో బుధవారం దర్శనమిచ్చే స్వామివారిని తిలకిస్తే మాందిగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.