లాల్‌బాగ్‌లో ప్రేమ జంట విహారం
ప్రేమకు డబ్బు, ఆస్తులు, అంతస్తులతో పని లేదు.ఒకరికొకరు నచ్చితే ప్రేమ మొగ్గ తొడిగి పుష్పిస్తుంది. ప్రేమ కోసం ఎంతగైనా సాహసించేవారూ ఉంటారు. చరిత్రపుటల్లో నిలిచిన ప్రేమికుడు వాలెంటైన్స్ గౌరవార్థం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా జరుపుకొంటుండడం తెలిసిందే. ఇందుకోసం వారం రోజుల నుంచే నగరం ముస్తాబవుతోంది. ప్రేమపక్షుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి.
సాక్షి, బెంగళూరు: మెట్రో సిటీ వాలెంటైన్స్ డే వేడుకలకు సాదర స్వాగతం పలుకుతోంది. మాల్స్, స్టాల్స్, హోటళ్లలో ప్రేమికుల రోజు అలంకరణ తళుకుమంటోంది. గురువారం కోసం ప్రేమజంటలు రకరకాల వేడుకలను ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా గులాబీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు భారీగా ఎగుమతి కాగా, బెంగళూరులోనే ఐదు లక్షల గులాబీలు అమ్ముడవుతున్నాయి. అలాగే అనేక హోటళ్లు, రెస్టారెంట్లులో గులాబీల అలంకరణ మురిపిస్తోంది.
హోటళ్లు, రెస్టారెంట్లు సిద్ధం
నగరంలోని హోటల్, రెస్టారెంట్లు ప్రేమికుల పండుగకు సిద్ధమయ్యాయి. కోరమంగళ, ఇందిరానగర, వైట్‌ఫీల్డ్, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, దొమ్మలూరు, అశోకనగర, కొత్త విమానాశ్రయం రోడ్డు, ఎంజీరోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, చర్చ్ స్ట్రీట్, మల్లేశ్వరం తదితర చోట్ల ఉన్న హోటళ్లు, పబ్‌లు, డిస్కోథెక్‌లు ప్రేమికుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఆయా చోట్లా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో డీజే నైట్స్, క్యాండల్‌లైట్ డిన్నర్, మ్యూజిక్ లైట్ డిన్నర్, హెల్తీ డిన్నర్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా హోటళ్లు, రెస్టారెంట్లలో కనీసం రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు ఎంట్రీ ఫీజును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆయా కార్యక్రమాల కోసం ముందస్తు బుకింగ్‌లను కూడా ఉంచారు. రెస్టారెంట్లు, పబ్‌లలో ప్రేమ జంటల కోసం ఎన్నో ఆఫర్లను ప్రకటించారు.
ముమ్మరంగా వ్యాపారాలు
మార్కెట్లు, మాల్స్, కమర్షియల్ స్ట్రీట్‌లలో ప్రేమ జంటలకు అనువుగా స్పెషల్ బహుమతులను వ్యాపారులు విక్రయిస్తున్నారు. అత్యధిక సంఖ్య లో గ్రీటింగ్ కార్డులు, ఫోటో ఫ్రేములు, హృదయాకారంలో బంగారు, వజ్రాభరణాలు, కీచైన్లు, తాజ్‌మహల్ బొమ్మలు తదితర కానుకలకు డిమాండ్ నెలకొంది. తమ ప్రియులైన వారికి బహుమతులు ఇచ్చేందుకు ప్రేమికులు షాపింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కొత్తగా విదేశీ చాకొలేట్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఎవరి స్థోమతను బట్టి వారు షాపింగ్‌లో నిమగ్నమయ్యారు.
చలో పార్కులు, పర్యాటక ప్రాంతాలు
నగరంలోని యువతీయువకులు ప్రేమికుల రోజును గడిపేందుకు నందిబెట్ట, బన్నేరుఘట్ట జాతీయ పార్కులకు వెళుతున్నారు. నగరంలోని చెరువులు, కాఫీ షాపులు, కాలేజీలు, సినిమా థియేటర్లు ప్రేమికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రేమికులకు పార్కులో ప్రవేశానికి ఎలాంటి నిషేధం విధించలేదు. కానీ బహిరంగంగా ముద్దుముచ్చట్లకు దిగితే ఊరుకోబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని ప్రముఖ లాల్‌బాగ్, కబ్బన్ పార్కుల్లో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి లేదు. పార్కులకు వచ్చే ప్రేమికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యాన సిబ్బంది భద్రత కల్పిస్తారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment