
'నేటి నుంచే చంద్రబాబు పాలన భూస్థాపితం'
విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా దారుణంగా ఉందని వంగవీటి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. 'సామాన్యవర్గంలో పుట్టినవాళ్లంతా కూడా చంద్రబాబు అనుమతితోనే బతికేయాలా? ఏమనుకుంటున్నారు ఆయన' అని నిలదీశారు. గురువారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మల్లాది విష్ణు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
విష్ణును వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు పరిపాలన భూస్థాపితం కావడం నేటి నుంచే మొదలైందని అన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో రాబోయే రోజుల్లో రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న రాజ్యం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. ఇక మల్లాది విష్ణు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడని, వైఎస్ జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.