ఎన్ని వేల కోట్లు చేతులు మారాయి?
బాబు సర్కారుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతి తెలిపే బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో విప్ జారీ చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌లో అందుకు అనుకూలంగా వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఎన్ని వేల కోట్లు చేతులు మారితే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. రిలయన్స్, వాల్‌మార్ట్, ఐటీసీ, లైఫ్‌స్టైల్ తదితర కంపెనీల ప్రతినిధులు సీఎంను కలిసి రాష్ట్రంలో రిటైల్ అవుట్‌లెట్ల ఏర్పాటుకు అనుమతి కోరిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించడం శోచనీయమన్నారు. గతంలో పార్లమెంట్‌లో వీటిని వ్యతిరేకించి ఇప్పుడు అనుమతిస్తామని చెప్పటం ఏమిటని నిలదీశారు.
2012లో పార్లమెంట్‌లో ఈ బిల్లును వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. అప్పుడు టీడీపీ సైతం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిందన్నారు. ఓటింగ్‌కు గైర్హాజరైన ఎంపీలకు షోకాజ్ నోటీసులిస్తున్నామని కూడా బాబు ప్రకటించారన్నారు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా టీడీపీకి చెందిన దివంగత ఎర్రన్నాయుడు బిల్లుపై అభ్యంతరం తెలిపారని గుర్తుచేశారు.