నల్లకుంట : హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠం సోమవారం భక్తులతో పోటెత్తింది. పౌర్ణమిని పురస్కరించుకొని మఠంలోని శక్తి గణపతి, శంకరభగవత్పాదులు, చంద్రమౌళీశ్వరుడు, లోకమాత శారదాంబలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ శత చంఢీ హోమం నిర్వహించారు. ప్రాంగణంలో మహిళా భక్తులచే కైలాస గౌరీ వ్రతం నిర్వహించి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందజేశారు. మధ్యాహ్నం దాదాపు 300 మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదానం నిర్వహించారు. సాయంత్రం శ్రీలలితా ప్రచార సేవక్ ఆధ్వర్యంలో శంకరమఠం ప్రాంగణంలో కొనసాగుతున్న శ్రీ లలితా అనుగ్రహ భాషణంపై ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం శ్రీ లలితా స్వరూపులు భగవాన్ శ్రీవత్స శ్రీ గురుదేవులు అనుగ్రహ భాషణలు ఇచ్చారు.